Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-నిర్మల్
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నిర్మల్ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను రెండు సంవత్సరాల కిందట విధుల నుంచి తొలగించారన్నారు. ఉపాధి హామీ కూలీలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందుబాటులో ఉంటూ పని చేస్తున్న సమయంలో ఉన్న ఫలంగా ప్రభుత్వం తొలగించడం అన్యాయమన్నారు. సీఎం చేసిన ఉద్యోగ ప్రకటనలో ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి కనీస ప్రస్తావన లేదన్నారు. సీఎం కేసీఆర్ మొండివైఖరితో 7651 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 74 మంది ప్రాణం కోల్పోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం నాయకులు సాయేందర్, రాములు, మహేష్, విఠల్, రాజేశ్వర్, రాజు, పోశెట్టి పాల్గొన్నారు.