Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గీత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి.రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్‌గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేవం జరిగింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ వంద కోట్లతో ప్రత్యేక పథకం ప్రవేశ పెడతామంటూ ఆర్థిక శాఖా మంత్రి చెప్పారనీ..బడ్జెట్పద్దుల్లో టాడీ కార్పొరేషన్ కు కేవలం రూ. 30 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. నీరా పాలసీకి రూ. 25 కోట్లు మాత్రమే చూపించారన్నారు. వృత్తిపై ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారనీ, వీరికి ఈ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని చెప్పారు. ప్రతి సొసైటీలో చెట్ల పెంపకానికి భూమి, కల్లుకు మార్కెట్ సౌకర్యం,నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు రూ. ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్లు పైబడిన గీత కార్మికులు పెన్షన్ కోసం దరఖాస్తులు పెట్టుకుని రెండేండ్లు దాటినప్పటికీ పింఛన్ ఇవ్వడం లేదని తెలిపారు. గీత కార్మికులకు మోపెడ్లు ఇస్తామని గత కొంత కాలంగా పదే పదే చెబుతున్నారనీ, ఆచరణలో అమలు చేయడం లేదని చెప్పారు. రాష్ట్రంలో సెంటు భూమి లేని గీత కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారని తెలిపారు. గీతన్న బంధు పేరుతో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృత్తిలో ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టడంతో పాటు సభ్యులందరికీ రైతు బీమాలాగా గీతన్న బీమా పథకాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
తక్షణమే ఎక్స్ గ్రేషియా అందే విధంగా చర్యలు చేపట్టాలనీ, గ్రామాలలో విచ్చలవిడిగా పెడుతున్న బెల్టుషాపులను నిరోధించాలని కోరారు. దశలవారీగా మద్య నిషేధం అమలు చేయాలి డిమాండ్ చేశారు. అనంతరం సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనింగ్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా సురుగు రాజేష్, కో కన్వీనర్ గా సుధాకర్, జలగం వెంకట్రావు, భూపతి శ్రీనివాస్‌తోపాటు మరో 9 మంది కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా నాయకులు జగదీష్ మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్ నర్సయ్య, సభ్యులు సారా వెంకటేష్, భుపతి శ్రీనివాస్ మేరిండ్ల శ్రీనివాస్,గాడేపల్లి శ్రీనివాస్,మేకపోతుల కృష్ణ, దీకొండ మధు తదితరులు పాల్గొన్నారు.