Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భట్టి మంచోడే..కాంగ్రెస్‌లో గట్టి అక్రమార్కులది నడుస్తున్నది
- మా సీఎం రాజీవ్‌గాంధీ ఔన్నత్యాన్ని పెంచాలని చూసిండు
- మీ అధ్యక్షుడేమో సంస్కార హీనంగా మాట్లాడిండు : కేటీఆర్
- సభలో లేని రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడమేంటి?
- ఆ పదాలను వెంటనే తొలగించాలి : భట్టి
- ఎలాంటి అధ్యక్షుణ్ని పెట్టుకున్నారయ్యా : మంత్రి ప్రశాంత్
- అనవసర డిస్కర్షన్... సబ్జెక్టులోకి రండి : స్పీకర్
నవతలెంగాణ బ్యూరో-హైదరాబాద్
శాసనసభలో గురువారం పద్దులపై చర్చ జరిగే సమయంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, సాంకేతిక సమాచార శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు మాట్లాడుతూ.. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్నా అన్యాయాన్ని ఎండగడుతూ..కాంగ్రెస్‌పైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంలో కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య సంవాదం జరిగింది. అందులో మరో మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో అదికాస్తా మరింత వాగ్వాదానికి దారితీసింది. స్పీకర్ జోక్యం చేసుకుని అనవసర డిస్కర్షన్ సబ్జెక్టులోకి రండి అని అదేశించాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు సభలో ఏం జరిగిందంటే.. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..' సింగరేణిని ప్రయివేటు పరం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఆ పరిస్థితి మనకు రావొద్దంటే మనం అప్రమత్తంగా ఉండాలి. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అక్కడ గొంతు విప్పాలి. మమ్మల్ని ఇక్కడ తిట్టుడు కాదు.. అక్కడ మాట్లాడండి.. అక్కడ బీజేపీని నిలదీయండి. తమాషా ఏందంటే మొన్న బీజేపీ సభ్యులు పోడియంలోకి వస్తే మీరు(స్పీకర్‌ను ఉద్దేశించి) నిర్ణయం తీసుకొని వారిని సస్పెండ్ చేశారు.
తెల్లారి చూస్తే బీజేపీ అధ్యక్షుడి కంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కువగా బాధపడుతున్నట్టు కనిపించింది. బీజేపీ సభ్యులను ఇక్కడ్నుంచి పంపించినందుకు బాగా బాధపడుతున్నాడు. అవిభక్త కవలల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా దారుణం. వీళ్ల ఒప్పందం ఏంటో అర్థం కావడంలేదు. హుజూరాబాద్ అసెంబ్లీ, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేసినట్టు..ఇప్పుడు కూడా బయట కలిసి పని చేస్తున్నట్టు అనుమానాలున్నాయి...' అంటూ వ్యాఖ్యానించారు. అంతలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవబోగా..'అరె కూర్చోండి. భట్టి చాలా మంచివారు. కానీ, దురదృష్టమేటంటే ఆయనది నడుస్తలేదు. గట్టి అక్రమార్కులది నడుస్తున్నది' అని కేటీఆర్ అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిస్తుండగానే 'స్పీకర్‌గారూ..ఆయనకు మైకు ఇవ్వండి' అని కేటీఆర్ అన్నారు. 'నిమ్జ్, సింగరేణి, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తదితరాలపై కేంద్రంతో కొట్లాడాల్సిందే. కలిసి ముందుకుపోవాల్సిందే. కానీ, సభలో లేని పార్లమెంట్ సభ్యుని గురించి మాట్లాడటం సరిగాదు. ఆ పదాలను రికార్డుల్లోంచి తీసేయాలని స్పీకర్‌ను కోరుతున్నా' అని భట్టి మాట్లాడారు. వెంటనే కేటీఆర్ మైకు అందుకున్నారు. 'భట్టిగారూ మిమ్మల్ని పొగుడుతున్నాం. విక్రమార్క మంచివాడు. దక్షతగల నాయకుడు. అని పొగిడిన. పొగడటాన్ని కూడా రికార్డుల నుంచి తొలగించాలా? భట్టి మంచివారే. వారి పార్టీలోని గట్టి అక్రమార్కులదే నడుస్తున్నది. భట్టిది నడుస్తలేదు' అంటూ మరోమారు రేవంత్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దీనిపై భట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'మా పార్టీ అధ్యక్షుని గురించి ఇలా మాట్లాడటం కరెక్టు కాదు. రికార్డుల నుంచి తొలగించాలి. మంత్రిగారు అలా మాట్లాడొద్దు' అంటుండగానే..శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ 'వాళ్ల పార్టీ అధ్యక్షునికి సంస్కారం ఉందా? సీఎం పుట్టినరోజు నాడు పిండం పెట్టాలని పిలుపునిస్తడా? ఏం తమాషా? సంస్కారం ఉందా? ఎలాంటాయనను అధ్యక్షుడిగా పెట్టుకున్నారయ్యా?' అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంతలోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ 'ఇది అనవసర డిస్కర్షన్. సబ్జెక్టులోకి రండి' అని సూచించారు. భట్టి మైకు తీసుకుని 'లెజిస్లేచర్ మంత్రి సభలో ఇలా మాట్లాడటం సరిగాదు' అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే కేటీఆర్ కల్పించుకుని మాట్లాడుతూ.. 'నేను ఏం మాట్లాడాలో డిసైడ్ చేస్తరా? ఒక ముఖ్యమంత్రి ఉన్నడు పేరు చెప్పొద్దుగానీ. అస్సాం సీఎం ''రాహుల్ గాంధీని పట్టుకుని అసలు రాజీవ్‌గాంధీ కుమారుడివేనా అని రుజువు చూపాలని అడిగామా?'' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మా సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. నిరసనలకు పిలుపునిచ్చారు. ఇది కదా సంస్కారమంటే. వాళ్ల అధ్యక్షుడేమో మా సీఎం పుట్టిన రోజు ఉంటే.. మూడు రోజు సంతాప దినాలు చేయాలని అంటారా? రాజీవ్‌గాంధీ ఔన్నత్యాన్ని పెంచేలా కేసీఆర్ మాట్లాడితే..మీ అధ్యక్షుడేమో సంస్కార హీనంగా మాట్లాడాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సబ్జెక్టులోకి వస్తున్నా' అంటూ తన శాఖ పద్దుపై మాట్లాడారు.