Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయాన్ని గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. ఎంఐఎం మినహా ఎక్కువ ప్రశ్నలు అదికార పార్టీ సభ్యుల నుంచే వచ్చాయి. దాదాపు 20 మంది సభ్యులు ప్రజాసమస్యలు, ప్రభుత్వ పథకాలు, వాటి అమలుతీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిలోని రోడ్లు, మూసీనది పరిశాహక ప్రాంత అభివృద్ధి గురించి చర్చ జరగడం గమనార్హం. పర్యాటక ప్రాంతాలు, రోడ్లు, పాడిపరిశ్రమ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల గురించి కూడా సభ్యులు పలు అంశాలను లేవనెత్తారు. మూసీ నది అభివద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంత అభివద్ధి పథకం కింద చేపట్టిన పనులపై ఎంఐఎం సభ్యుడు మోజం ఖాన్, టీఆర్ఎస్ సభ్యుడు దానం నాగేందర్, వివేకానందగౌడ్, అరికెపూడి గాంధీ, కాలేరు వెంకటేశ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2014, 2015 సంవత్సరాల్లో రెండు మూడు సందర్భాల్లో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హాఫీజ్ కాంట్రాక్టర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో బాల్య వివాహాలకు చెక్ : మంత్రి గంగుల కమలాకర్
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేయడంతో రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టగలిగామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయా పథకాలపై టీఆర్ఎస్ సభ్యులు అజ్మీరారేఖా నాయక్, దుర్గం చిన్నయ్య, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నన్నపునేని నరేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ రెండు పథకాల కింద 10 లక్షల 26 వేల 396 మంది లబ్ధి పొందారు. బీసీ సంక్షేమం ద్వారా 4,87,346 మంది, గిరిజన శాఖ ద్వారా 1,21,639 మంది, మైనార్టీ శాఖ ద్వారా 2,10,676, ఎస్సీ శాఖ ద్వారా 2,06,735 మంది లబ్ధి పొందారు. ఈ రెండు పథకాలకు మొత్తంగా రూ. 8,673.67 కోట్ల ఖర్చు చేశామని తెలిపారు. కులాంతర వివాహాలకు కూడా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేసి, చెక్‌లు అందిస్తున్నామని అన్నారు. భార్య బీసీ, భర్త ఓసీ అయినప్పటికీ చెక్‌లు ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఒక వేళ ఎక్కడైనా సమస్య ఎదురైతే తమ దష్టికి తీసుకురావాలని సభ్యులకు మంత్రి సూచించారు.
విజయ డెయిరీ టర్నోవర్ రూ. 750 కోట్లు : మంత్రి తలసాని
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం ద్వారా కులవత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డెయిరీ టర్నోవర్ రూ. 750 కోట్లకు చేరిందన్నారు. రూ. నాలుగు చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల పాల రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివద్ధిపై టీఆర్ఎస్ సభ్యులు అంజయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గొంగిడి సునీత తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు.
ఇతర దేశాలతో పోటీ పడేలా పర్యాటకాభివృద్ధి :శ్రీనివాస్ గౌడ్
సరళా సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పర్యాటక రంగాన్ని అభివద్ధి చేస్తామన్నారు. ఈ రెండు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలంటూ అధికార పార్టీ సభ్యుడు ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ కోయిల్ సాగర్ ప్రాంతాన్ని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రూ. 8.30 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇదే రకంగా సరళా సాగర్‌ను కూడా అభివృద్ధి పరుస్తామని చెప్పారు.
హైదరాబాద్ అభివద్ధికి బహుముఖ వ్యూహం : కేటీఆర్
హైదరాబాద్ నగర అభివద్ధికి బహుముఖ వ్యూహాంతో ముందుకెళ్తుతున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివద్ధి ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ) కింద రూ. 37 వేల కోట్లతో 70 పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2497 కోట్లతో 27 పనులు పూర్తయ్యాయి.
హైవేలను అభివృద్ధి చేస్తాం: మంత్రి వేముల
రాష్ట్రంలో హైదరాబాద్-కల్వకుర్తి జాతీయ రహదారిని మరింతగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీ సభ్యుడు జైపాల్‌యాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ... యాక్సిడెంట్లను నివారించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
దివంగత ఎమ్మెల్యేలకు సభ సంతాపం
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ ఫరీదుద్దీన్, శాయంపేట మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి మరణం పట్ల శాసనసభ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు స్పీకర్ పోచారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారి మరణానికి సంతాప సూచకంగా సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది.