Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిన్నిస్ రికార్డులో ఆయనకు స్థానం కల్పించాలి
- లక్ష ఉద్యోగ ఖాళీలను దాచిపెట్టారు
- బడ్జెట్ సమావేశాల తర్వాత కార్యాచరణ:
పీసీసీ చీఫ్ రేవంత్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ ఖాళీలపైన అబద్ధాలు వల్లె వేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. అబద్ధాలు లెక్కిస్తే ఆయనకు గిన్నిస్ రికార్డులో స్థానం దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడు లక్షల 90 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారనీ, అందులో తొమ్మిది వేల ఉద్యోగ ఖాళీలు చూపించి, లక్షా ఉద్యోగాలను దాచిపెట్టారని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అంతకు ముందు పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. బిస్వాల్ కమిటీ, తాజా రాజకీయ పరిణామాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చించారు. అనంతరం సీఎం ఉద్యోగాలపై మాట్లాడుతూ లక్షా 21వేల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ ఉద్యోగులను నియమిస్తే ప్రభుత్వంపై రూ ఏడువేల కోట్ల భారం పడుతున్నదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకే ఆయన అసెంబ్లీలో మాట్లాడారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్బెడ్రూమ్, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఎన్నో హామీలు ఇచ్చారనీ, ఇప్పటివరకు అమలు చేయలేదని చెప్పారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మెన్ చక్రపాణి గతంలోనే 36వేల ఉద్యోగాలు భర్తీ చేశామంటూ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం హామీమేరకు ఒక్కో నిరుద్యోగికి లక్షా 20వేల నిరుద్యోగ భృతి బాకీ పడ్డారని చెప్పారు. టీఎస్పీఎస్సీలో 28 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనీ, అందులో లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఐదు రాష్ట్రాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తా
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజాతీర్పును రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ఓడిపోవచ్చు.కానీ బీజేపీకి పెద్దగా రాలేదు' అన్నారు. పంజాబ్ లో అధికారంలో ఉండి తాము ఓడి పోయామనీ, అక్కడ బీజేపీ గెలవ లేదని చెప్పారు. ఈ ఫలితాలు తెలం గాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపబోవని చెప్పారు. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందనీ, తెలంగాణలో ఓడిపోయిందన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పంజాబ్‌లో కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దూ కారణమని చెప్పారు. ఎమ్మెల్యే దూద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ లోపాలు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందనీ, పంజాబ్‌లో అంతర్గత పంచాయితీలు సమస్య కాదని చెప్పారు.