Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులకు కొత్త పింఛన్లు ఇవ్వాలి
- నిరుద్యోగ భృతి అమలు చేయాలి
- మండలిలో జీవన్‌రెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఓ గ్రామంలో పటేల్ చనిపోతే రైతుబీమా రూ.ఐదు లక్షలు వస్తాయి. అదే భూమిలేని పాలేరు చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. వ్యవసాయ కూలీలకూ రైతుబీమా వర్తింపచేయాలి. అందులో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.'అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి చెప్పారు. శాసనమండలిలో గురువారం బడ్జెట్‌పై సాధారణ చర్చలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత ఉన్నోళ్లందరికీ కొత్త పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభయహస్తం కింద మహిళలు దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరారు. 80,039 కొలువులు ప్రకటించారనీ, నియామకాల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముందనీ, అప్పటి వరకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3,016 అమలు చేయాలని వివరించారు. గల్ఫ్ బాధితులు చనిపోతే రూ.ఐదు లక్షలు పరిహారం ఇస్తామన్నారనీ, ఏడేండ్లలో ఐదు రూపాయలు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ క్రమంలో గల్ఫ్ ఎన్ఆర్ఐ పథకాన్ని ప్రారంభించాలని సూచించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు వంటి పథకాల నిధులు సకాలంలో రావడం లేదనీ, వాటిని గ్రీన్‌ఛానెల్ పరిధిలోకి తేవాలని కోరారు. దళితబంధు కొందరికే ఇస్తే మిగిలిన వారు వ్యతిరేకంగా మారే ప్రమాదముందన్నారు. అందుకే ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు కాకుండా కలెక్టర్లు, అధికారులకు ఇవ్వాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్సీలకూ ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంత పెద్దబాధ్యత తనకొద్దని జీవన్‌రెడ్డి చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద ఇంటికి ఇచ్చే రూ.2.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం స్వంత జాగా ఉంటే రూ.మూడు లక్షలు ఇస్తామని ప్రకటించిన దాంట్లో భాగమా?అని అడిగారు. లేదంటే ఒక్కో ఇంటికి రూ.5.50 లక్షలు వస్తాయని వివరించారు. గిరిజన రిజర్వేషన్లు కేంద్రంలో 7.5 శాతం, రాష్ట్రంలో 6 శాతం అమలవుతున్నాయని చెప్పారు. గిరిజన రిజర్వేషన్లు పెంచడమనేది కేంద్రానికి సంబంధం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచకపోతే నాలుగు శాతం గిరిజనులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంక్షల్లేకుండా వరిధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కోతుల బెడదను నివారించాలనీ, పునరుత్పత్తిని నిలిపివేయాలని సూచించారు. పంటరుణాలపై స్వల్పకాలిక వడ్డీ రాయితీ కేంద్రం మూడు శాతం, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందని చెప్పారు. రూ.75 వేల వరకు రుణమాఫీ పొందే రైతులు 16 లక్షల మంది ఉన్నారని విరించారు. అదే రూ.75 వేల నుంచి రూ.లక్షలోపు వారు 21 లక్షల మంది రైతులున్నారని అన్నారు. రూ.లక్ష వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ట్రాక్టర్ నిర్వహణ, విద్యుత్ బిల్లులకే సరిపోతున్నదని అన్నారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోక్యం చేసుకుని ట్రాక్టర్ల మీద రూ.లక్షల ఆదాయం వస్తున్నదని చెప్పారు. వాటి ఆదాయంతో గ్రామపంచాయతీలు నడుస్తున్నాయని వివరించారు. అలాంటి వివరాలుంటే సభ్యులకు ఇవ్వాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.