Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అణగారిన వర్గాలకు మనుధర్మం చదువను నిషేధిస్తే.. దానికి వ్యతిరేకంగా మహిళలు, శూద్రులకు చదువు నేర్పించిన అక్షర దివిటి సావిత్రి బాయి ఫూలే అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఆ సంఘం కార్యాలయంలో సావిత్రిభాయి పూలే 125 వ వర్ధంతిని కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐల సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ మనుస్మృతి దేశంలో మెజార్టీ ప్రజలకు చదువు నిరాకరించే విధంగా మానసిక చట్టాలు చేసిందని తెలిపారు. ఈ క్రమంలో సావిత్రిబాయి తన భర్తను మొదట గురువుగా స్వీకరించి అనేక అవమానాలు ఛీత్కారాలు ఎదుర్కొని అణగారిన వర్గాల పాలిట అక్షర ధివిటి అయిందని పేర్కొన్నారు. నాటి విధానాలను తిరిగి అమలు చేసేందుకు నేటి పాలకులు చట్టసభలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. విద్యారంగంలో మత విశ్వాసాలను జొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ సావిత్రిబాయి మాత్రమే దేశానికి చదువుల తల్లి అని తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ నూతన విద్యావిధానం ద్వారా పేదలకు చదువులకు దూరం చేయటమంటే..విద్యను ప్రయివేటు పరం చేయటమేనన్నారు. ఆ రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ, రాష్ట్ర నాయకులు తాటికొండ రవి, రజినీకాంత్, సాయికృష్ణ, బీమేష్, విగేష్, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.