Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దఎత్తున రాస్తారోకో చేసిన రైతులు
నవతెలంగాణ-భిక్కనూర్
యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిని గురువారం దిగ్బంధించారు. గ్రామంలోని సింగిల్ విండో సొసైటీ కార్యాలయం వద్ద పొందుర్తి, తలమడ్ల, ఆరేపల్లి గ్రామాల రైతులు ఉదయం నుంచి యూరియా కోసం వేచి చూశారు. గోదాంలో ఉన్న కొద్దిపాటి యూరియా కొంత మందికి అందజేయగా.. మిగిలిన రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సొసైటీ చైర్మెన్ సిద్ధిరాములు, సిబ్బంది రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సొసైటీ చైర్మెన్ తీరుపట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. యూరియా అందజేయని సొసైటీలు ఎందుకని నిలదీశారు. పాలకవర్గ సభ్యుల నుంచి సమాధానం రాకపోవడంతో 44వ జాతీయ రహదారిపైకి రైతులు భారీగా చేరుకుని బైటాయించారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకోలో పాల్గొనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అందించారు. అడిషనల్ ఎస్పీ అనొన్యా, సీఐ తిరుపయ్య, ఎస్ఐ ఆనంద్ గౌడ్, రాజంపేట ఎస్ఐ రాజు వచ్చారు. భారీ బందోబస్తు నిర్వహించారు. దీంతో గంటన్నర పాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో అడిషనల్ ఎస్పీ అనొన్యా కలుగజేసుకొని రేపటిలోగా రైతులందరికీ యూరియా ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇవ్వడంతో శాంతించారు.