Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగానికి నిధులను 15 శాతానికి..
- వైద్యరంగానికి ఎనిమిది శాతం ఇవ్వాలి : మండలిలో నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనుకూలమైన అంశాలతో పాటు సవరించుకోవాల్సిన అంశాలున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ.... విద్యరంగానికి కేటాయింపులను 15 శాతానికీ, వైద్యరంగానికి ఎనిమిది శాతానికి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ప్రారభించాలని కోరారు. మొదటి దశలో 9,123 పాఠశాలల అభివద్ధికి రూ.3,497.62 కోట్లు మార్చి 31 నాటికి జమ చేయాల్సి ఉందనీ, దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణంపై శ్రద్ధ పెట్టాలనీ, మధ్యాహ్న భోజన రేట్లను పెంచాలని కోరారు. గుడ్డు రేటును రూ.ఐదు చేయాలనీ, వంట ఏజెన్సీ పారితోషికం రూ.3,000 ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ విద్యలో 75 శాతం మంది ప్రయివేటు, కార్పొరేటు జూనియర్ కళాశాలల్లో చదువుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ తీరు మారాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేయాలని కోరారు. డిగ్రీ విద్యలో 75 శాతం మంది ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నారనీ, ఈ పరిస్థితిని మార్చేందుకు వెంటనే మారుమూల ప్రాంత ప్రభుత్వ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలకు బడ్జెట్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. సెకెండరీ విద్యలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరో ఎనిమిది వేల ఖాళీలుండే అవకాశముందంటూ వాటినీ నియామకాల్లో చేర్చాలని కోరారు. వంద మందికిపైగా విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో తరగతికొక ఉపాధ్యాయున్ని నియమించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాల్లో పారిశుధ్యం, ఇతర సర్వీసుల కోసం పాఠశాల విద్యాశాఖ ద్వారానే నియామకాలు చేపట్టాలనీ, విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు.
పట్టణ జనాభా పెరుగుతున్నందున అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. బస్తీ దవాఖానాలు యూపీహెచ్‌సీలకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. గ్రామీణ పీహెచ్‌సీలను నిరంతరాయంగా పని చేసేలా డాక్టర్లు, నర్సుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి కొత్త భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరారు.
పెరిగిన తలసరి ఆదాయానికి తగినట్టు గ్రామ పంచాయితీలు, మున్సిపాల్టీలు, జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రెమ్యునరేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో పని చేసే బోధనేతర సిబ్బందికి పీఆర్సీ ప్రకారం 30 శాతం రెమ్యునరేషన్ పెంచాలని కోరారు. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షలో పని చేస్తున్న సిబ్బందికి కనీస వేతనాన్ని అమలు చేయాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలోని టీచర్లకు గతంలో మాదిరిగానే పారిటీ స్కేళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 73 షెడ్యూలు ఎంప్లాయిమెంట్ పరిశ్రమలకు సంబంధించి జీవోలు సవరించి కనీస వేతనాలు అందేలా చూడాలని అలుగుబెల్లి ఆర్థిక మంత్రిని కోరారు.
ధరణి పోర్టల్‌లో లోపాలను సరి చేయాలనీ, రైతుబంధును కౌలు రైతులకు వర్తింపజేయాలనీ, గిరిజనులకు గిరిజన బంధు, వెనుకబడిన తరగతుల వారికి బీసీ బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయాలనీ, డీఏలు విడుదల చేయాలని కోరారు. మైనార్టీ సంక్షేమానికి అదనంగా నిధులు కేటాయించాలనీ, శ్రీశైలం ఎడమగట్టు సొరంగ మార్గం పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కాకుండా, బిడ్డ సొమ్ము తల్లిదండ్రులు కాపాడినట్టుగా ఉండాలని నర్సిరెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో చైర్మెన్ జాఫ్రి ముగించాలని కోరడంతో పలు సూచనలతో కూడిన పత్రాన్ని చైర్మెన్ ద్వారా ఆర్థిక మంత్రికి అందజేశారు.
ఎందులో కోత విధించాలి...?
విద్య, వైద్యానికి నిధులు పెంచాలని నర్సిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అడ్డు తగిలారు. పలు విభాగాల వారీగా కేటాయించిన నిధులు సరిపోవనీ, వాటిని పెంచాల్సిన అవసరముందని నర్సిరెడ్డి చెబుతుండగా, ఉన్నదాంట్లోనే సర్దుబాటు చేయాలిగా...?మరి ఎందులో కోత విధించాలో చెప్పాలంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. అలుగుబెల్లి స్పందిస్తూ....ఎందులో కోత విధించాలో కూడా చెబుతాననీ, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తే ఆ విషయాన్ని వివరిస్తానని జవాబిచ్చారు..