Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడే బీజేపీ నేతలకు మాట్లాడే నైతికత ఉంటుంది: మండలిలో మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు మోడీ సర్కారును డిమాండ్ చేశారు. వాటిని భర్తీ చేసిన తర్వాతే బీజేపీ నేతలకు రాష్ట్రంలోని ఖాళీల భర్తీపై మాట్లాడే నైతికత లభిస్తుందని చెప్పారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ మాట తప్పిందని విమర్శించారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఆ ఖాళీలను భర్తీ చేస్తే రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు నిరుద్యోగుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాటి భర్తీ కోసం ఢిల్లీలో పోరాడాలని సవాల్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు బీజేపీ నాయకులను నిలదీయడం ఖాయమని హెచ్చరించారు. రైల్వేలో మూడు లక్షలు, బ్యాంకులు, ఎల్ఐసీలో 41 వేలు, అదే విధంగా ఆర్మీ, నేవీ, సీఆర్పీఎఫ్ తదితర విభాగాల్లో లక్షలాది ఖాళీలు భర్తీ చేయని బీజేపీ నాయకులు కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల కన్నా సర్దుబాటు చేసి అదనంగా ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు లేదని స్పష్టం చేశారు. ఆయా పార్టీలు పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేశారా? అని ప్రశ్నించారు. వంద శాతం ఖాళీలను భర్తీ చేస్తున్న మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. యూనివర్సిటీల్లో ఖాళీలనూ భర్తీ చేస్తామనీ, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 వివాదం సమిసిపోతే మరింత మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కొత్త ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు బడ్జెట్లో రూ.రెండు వేల కోట్ల ప్రొవిజన్ పెట్టినట్టు తెలిపారు.
పదేండ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీల కోసం కేటాయించిన దాని కన్నా టీఆర్ఎస్ సర్కారు ఒక్క ఏడాదిలోనే వారికి ఎక్కువగా నిధులిచ్చిందని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడుతూనే, సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిగా గుర్తించిన వారికి మాత్రమే రూ.72 వేలను ఇస్తున్నదనీ, రాష్ట్రంలో రేషన్ కార్డుల్లో కూడా అన్నింటికీ బియ్యం ఇవ్వకుండా షరతులు విధిస్తున్నదని విమర్శించారు. ఏడేండ్లలో విద్య కోసం 13.25 శాతం నిధులను కేటాయించామనీ, వాటి వివరాలు తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశామనీ, దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. 57 ఏండ్లకే పింఛన్ ఇవ్వాలని గతేడాదే అనుకున్నప్పటికీ కరోనా కారణంగా అమలు చేయలేకపోయామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ హామీని అమలు చేస్తామన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ఏడాదికి రూ.ఐదు వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.25 కోట్లను ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా రాష్ట్ర రైతాంగం కోసం సంస్కరణలను వ్యతిరేకించామని గుర్తుచేశారు. కేంద్రం, ఆర్బీఐ పరిమితికి లోబడే రాష్ట్రం అప్పులు చేసిందనీ, ఇదే విషయాన్ని కేంద్రం కూడా ప్రకటించిందని తెలిపారు.
పారిశుధ్య కార్మికుల కోసమే....
పారిశుధ్య కార్మికులకు మంచి వేతనాలివ్వాలనే ఉద్దేశంతో ఆస్పత్రుల్లో ఒక్కో పడకకు రూ.5,000 నుంచి రూ.7,500కు పారిశుధ్య ఖర్చును పెంచామన్నారు. కరోనా తర్వాత వైద్యాన్ని మెరుగు పరచాలని భావించి వైద్యారోగ్య బడ్జెట్‌ను రెట్టింపు చేశామని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ స్థాపించి, అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్యకళాశాలున్న రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 60 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలను నెలకొల్పితే టీఆర్ఎస్ ఏడేండ్లలో 12 కాలేజీలను తెచ్చిందనీ, ఇదే కాంగ్రెస్ కు, టీఆర్ఎస్కు ఉన్న తేడా అని విమర్శించారు. రాష్ట్రం సొంత ఆదాయం పెరిగిందనీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఖర్చు చేసే విషయంలో తెలంగాణ రెండో స్థానంలో రాష్ట్రముందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చే రూ.ఐదు కోట్లలో రూ.రెండు కోట్లను నేరుగా మినహాయించుకోవడాన్ని మంత్రి సమర్థించుకున్నారు. రూ.ఏడు వేల కోట్లతో బడులను మార్చే క్రమంలో నాబార్డ్, సర్వశిక్ష అభియాన్ తదితర రూపాల్లో నిధుల సేకరణ చేసి సకాలంలో అనుకున్న పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. దీంతో వాటిని ఖర్చు చేసే అధికారాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇక మిగిలిన రూ.మూడు కోట్లలో 10 శాతం అంటే రూ.30 లక్షలను ప్రజా ప్రతినిధుల అధికారం మేరకు హరిత కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చన్నారు. అభయ హస్తం పథకంలో మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును వారికి తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. చర్చలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, రఘోత్తమ్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.