Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ను నమ్మినోళ్లు చదువుల్లో నిమగ్నం
- మాది మోడీలా మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం
- నమ్మకం లేనోళ్లు మోడీ 2 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
- ఎమ్మెల్యేల్లారా విద్యార్థుల కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి
- రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఒకేసారి 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేశామనీ, ఇది కొలువుల జాతర కాదు..కొలువుల కుంభమేళ అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరిగాయనీ, విద్యార్థులు,ఉద్యోగ అభ్యర్థులు అప్పుడే చదువుల్లో మునిగిపోయారని చెప్పారు.ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు,ముగ్గురు నాయకులు సీఎం ప్రకటన నమ్మబోమంటూ స్టేట్మెంట్ ఇచ్చారన్నారు.సీఎంపై నమ్మకం లేని వారు మోడీ ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమది మాటల ప్రభుత్వం కాదనీ, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. బీజేపీ నేతల మాటలు కోటల్లా..పనులేమో పకోడీల్లా ఉంటాయని విమర్శించారు. మోడీ సర్కారు ఏండేండ్ల కాలంలో ఇస్తామన్న 14 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశారు. ఓ జర్నలిస్టు మోడీని ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీపై ప్రశ్న అడిగితే..''మీ సంస్థ ఓ అబ్బాయి పకోడీ షాపు పెట్టుకున్నాడు కదా..దాని ద్వారా ఉపాధి పొందుతున్నాడుగా అది ఉద్యోగమే'' అని మోడీ సమాధానం ఇచ్చారని విమర్శించారు. నరం లేని నాలుక కదా ఇష్టమొచ్చినట్లు చెప్తారన్నారు.
అచ్చేదిన్కాదు..సచ్చేదిన్
ఫిట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా..ఇలా మోడీ సర్కారుకు అందమైన నినాదాలివ్వడమే తెలుసనీ, ఓ పాలసీ ఉండదు..అచ్చేదిన్కాదు..సచ్చేదిన్ వచ్చిందని విమర్శించారు. అందుకే కరోనా సమయంలో పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఆత్మనిర్భర్ కింద రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అక్కరకొచ్చిందని ప్రశ్నించారు. ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలోనే తెలంగాణ ముందంజలో ఉందని తేలిందన్నారు. భౌగోళికంగా 11వ, జనాభాపరంగా 12వ పెద్దరాష్ట్రమైన తెలంగాణ ఆర్థిక రంగంలో నాలుగో అతిపెద్ద చోదక శక్తిగా ఉందని వివరించారు. రాజస్థాన్, యూపీలకు అన్నం పెట్టి సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2 లక్షల 78 వేలకు పెరిగిందన్నారు. జీఎస్డీపీ రూ. 11 లక్షల 54 వేల కోట్లు.. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కొందరికి నచ్చడం లేదన్నారు. కేంద్రాన్ని నాలుగు ఐటీ కారిడార్లు ఇవ్వాలని అడిగితే పట్టించుకోవడం లేదన్నారు. జహీరాబాద్, ఫార్మాసిటీ పారిశ్రామిక సమూహాలను నిమ్జ్గా గుర్తించిందనీ, కేంద్రం మద్దతుతో వేల కోట్ల రూపాయల నిధులు, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశిస్తే నిరాశే మిగిలిందని తెలిపారు. '2016లో జహీరాబాద్ నిమ్జ్గా గుర్తింపునిచ్చింది. ఏడేండ్లకాలంలో కేవలం మూడు కోట్ల రూపాయలనే ఇచ్చింది. ఫార్మా సిటీకి 2017లో జీవో ఇచ్చింది. ఆరేండ్లలో రూ. 5 కోట్ల రూపాయలనే విడుదల చేసింది. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా?' అని విమర్శించారు. 1987 వరకు ఇండియా, చైనా జీడీపీ సమానమనీ, 35 ఏండ్ల తర్వాత చైనాది 16 యూఎస్ ట్రిలియన్ డాలర్లకు చేరితే మన జీడీపీ 2.4 యూఎస్ ట్రిలియన్ దగ్గరే నిలిచిందని వివరించారు. చైనా ప్రపంచానికే ఒక ఫ్యాక్టరీలా మారాలనీ, ఉత్పత్తి కేంద్రంగా ఉండాలనే లక్ష్యం ముందుకు సాగటం వల్లనే అది సాధ్యమైందన్నారు. తెలంగాణ కూడా పారిశ్రామిక రంగంపై దృష్టి సారించిందన్నారు. మన దగ్గర పండే పత్తి అత్యంత నాణ్యమైనదనీ, అందుకే టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచానికి అవసరమయ్యే 35 శాతం వరకు వ్యాక్సిన్లు హైదరాబాద్ కేంద్రంగానే తయారు అవుతున్నాయన్నారు. హైదరాబాద్ శివారులో అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుంటే కొందరు రాష్ట్ర ప్రభుత్వం రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.. సహాయం చేస్తాం
విద్యార్థుల కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు పిల్లలకు భోజన సదుపాయాలు కల్పించేందుకు కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మిగతావాళ్లు అదే బాటలో నడవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని హామీనిచ్చారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు. టీ శాట్ ద్వారా పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నామనీ, దానికి 35 లక్షల మంది వీవర్షీప్ ఉందని చెప్పారు.