Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాస్తా..
- వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
దళితులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడద అమలు చేయని దళిత ద్రోహి సీఎం కేసీఆర్ అని తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ప్రజా ప్రస్థానం పాదయాత్ర నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం నుంచి ప్రారంభమైంది. నార్కట్‌పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తల్లి విజయమ్మతో కలిసి ఆమె ప్రసంగించారు. దళితులకు మూడెకరాల సాగు భూమి.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, సబ్సిడీపై రుణాలు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేయకముందే నిరుద్యోగ సమస్యపై గళమెత్తి నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు దీక్షలు చేశామన్నారు. కేవలం 80 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించి సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. రైతులకు రుణ మాఫీ లేదని, చివరికి వరి వేయకుండా.. ధాన్యం కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వరి సాగు చేయొద్దంటున్న పాలకులు.. నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి కాళేశ్వరం.. ఇతర ప్రాజెక్టులు దేని కోసం కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలు వస్తేనే జిల్లాలకు వస్తారని ఎద్దేవా చేశారు. నార్కట్‌పల్లి బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తాము ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభిస్తే.. దేని కోసం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారని.. సమస్యలు ఉన్నాయి కాబట్టే పాదయాత్ర చేస్తున్నా.. దమ్ముంటే ఏ సమస్యలూ లేవని నిరూపించండి.. ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు.