Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
- సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి రెండేండ్లు అవుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర నాయకత్వానికి, మోడీ, అమిత్ షా, నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా పనిచేస్తున్నామనీ, ఆ రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారనీ, కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేసేలా నిందలు మోపుతున్నారని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలు ఏమీ కోరుకుంటున్నారో తెలుసుకున్నామన్నారు.
తెలంగాణలో బీజేపీ లేకుండా చేయలానుకున్నారు : రాజాసింగ్
తెలంగాణలో బీజేపీ లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్ విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై 47 కేసులున్నాయనీ, ఇంకా నాలుగు కేసులు ఉన్నాయని తెలియదన్నారు. కేసుల గురించి తెలపాలని డీజీపీకి లేఖ రాసినా స్పందించలేదన్నారు. తమ లీగల్ టీమ్‌నే ప్రతి పీఎస్‌లో ఆరా తీసిందన్నారు.
నాలుగు కేసులతో తనకు సంబంధం లేదనీ, అనవసరం మూడేండ్లుగా తనను మానసికంగా వేధించారని పేర్కొన్నారు. తన ఎమ్మెల్యే పదవిని పోగొట్టాలనే ఉద్దేశంతో అనవసరంగా గోషామహల్ టీఆర్ఎస్ అభ్యర్థితో కేసు వేయించారన్నారు. బీజేపీని ఎంత అణచాలని చూశారో తెలంగాణలో అంత వేగంగా పుంజుకున్నదన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ..ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేశ్‌కుమార్ తెలంగాణకు సీఎస్ ఎలా అవుతారని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోడీని కలుస్తామన్నారు. తమను సభ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటివరకూ చెప్పలేదన్నారు. హైకోర్టు తమ పిటిషన్‌ను కొట్టేయడం బాధాకరమన్నారు.