Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ హామీమేరకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. తామర తెగులు సోకి మిర్చి పంట దెబ్బతిన్నదనీ, ఆ పంటకు పరిహారంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో వ్యవసాయం, సహకార శాఖల పద్దులపై ఆయన సమాధానమిచ్చారు. కౌలు రైతుల సమస్య తెలంగాణలో లేదనీ, అందువల్ల ఇక్కడ కౌలు రైతులకు రైతుబంధు అమలు చేయడం కుదరదని చెప్పారు. వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వానికి దూరదష్టి, ఆలోచన లేదని విమర్శించారు. కేంద్ర నాయకత్వం ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు పలుచన చేస్తున్నదని చెప్పారు. ఎగుమతులను గాలికి వదిలేసి, గోదాముల నిల్వ పెంచుకోవాలని¸ కేంద్ర ప్రభుత్వ కమిటీలు చెప్పినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో కరోనా మూలంగా కొంత వెనకబడిపోయామనీ, ఈసారి కేటాయింపులు చేశామన్నారు.
రెండో విడత గొర్రెల పంపిణీ చేపడుతాం :తలసాని
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. కరోనాతో ఇబ్బందిపడుతున్న గొల్లకుర్మలకు యూనిట్ ధరను లక్షా 75వేలకు పెంచామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత చేప, రొయ్య పిల్లలను చెరువుల్లో ఉచితంగా వేస్తున్నామని చెప్పారు. వృత్తిదారులకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిరువ్యాపారుల జీఎస్టీ పరిమితి పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.
డీజిల్ ధరల వల్లే ఆర్టీసీకి నష్టం : మంత్రి పువ్వాడ అజరు
కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న డీజిల్ ధరల వల్లే రాష్ట్రంలో ఆర్టీసీకి తీవ్ర నష్టాలు సంభవిస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ చెప్పారు. కరోనా సమయంలోనూ ఆక్యుపెన్సీ తగ్గిందనీ, ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు పెరుగుతున్నదని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో రవాణా పద్దులపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలక్ట్రికల్ బస్సుల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడం వల్ల ఆదాయం వచ్చిందన్నారు. ఫ్యాన్సీ నెంబర్లకు ఈ బిడ్డింగ్ విధానం ద్వారా రూ.73 కోట్ల ఆదాయం సమకూర్చుకుందని తెలిపారు. రూ. 300 కోట్ల సీసీఎస్, పీఎఫ్ బకాయిలను చెల్లించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్పత్రిని సకల సౌకర్యాలతో కార్మికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.