Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించబోయే సార్వత్రిక సమ్మెలో వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు కూడా పాల్గొంటారని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు బైరపాక శ్రీనివాస్ తదితరులు వైద్యారోగ్యశాఖ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ ఎమ్‌డీకి సమ్మె నోటీస్ అందజేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్రంలో వివిధ కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మె చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని టీయుఎంహెచ్‌ఇయూ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. పారిశ్రామిక వివాద చట్టం 1947 సెక్షన్ 22 సబ్ సెక్షన్ (1)ని అనుసరించి సమ్మె నోటీస్ ఇచ్చినట్టు స్పష్టం చేశారు. ఆ నోటీస్‌తో పాటు 12 డిమాండ్లతో కూడిన పత్రాన్ని అందజేశారు. నాలుగు లేబర్ కోడ్లతో పాటు, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలనీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలనీ, కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలనీ, వారిపై లైంగిక వేధింపులు అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.