Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెంచాలని ప్రభుత్వం చెప్పినా ఇవ్వని అధికారులు
- టీఎస్జీసీసీఎల్ఏ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా విద్యాశాఖ అధికారులు మాత్రం అమలు చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్జీసీసీఎల్ఏ-475) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో 58 ఏండ్లు నిండిన కాంట్రాక్టు అధ్యాపకులు అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, ప్రచార కార్యదర్శి సయ్యద్ జబీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఆయా శాఖల అధికారులు ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచారని గుర్తు చేశారు. ఇంటర్ విద్యాశాఖలో మాత్రం 58 ఏండ్లే కొనసాగుతున్నదని వివరించారు. ఆ వయస్సు నిండిన కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాలను ఆపేయ్యాలంటూ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశించారని తెలిపారు. దీంతో సీనియర్ అధ్యాపకులు మానసిక ఆందోళనలో పడ్డారని పేర్కొన్నారు. కొందరికి ఆర్నెల్ల నుంచి జీతాలు రావడం లేదని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన రెండు రోజులకే ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఈ ఆదేశాలు జారీ చేయడం దారుణమని విమర్శించారు. కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.