Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్దులపై చర్చలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి
- రేషన్ సరుకులేవీ ?: మౌజంఖాన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసీఆర్ కాలం... నాటి కాకతీయులు, గుప్తుల స్వర్ణయుగం లాంటిదని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు అధ్యక్షతన శాసనసభలో పద్దులపై జరిగింది. ఈ సందర్భంగా తమ తమ శాఖలకు సంబంధించిన పద్దులను డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ అలీ, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, వి. శ్రీనివాస్‌గౌడ్, అజరుకుమార్, ఎస్.నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ ప్రవేశపెట్టారు. వాటిని ఆమోదించాలంటూ కోరారు.
రేషన్ షాపుల్లో సరుకుల్లేవు:మౌజంఖాన్
తొలుత చర్చను ప్రారంభించిన ఎంఐఎం సభ్యుడు మౌజంఖాన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో వెయ్యి ఆర్టీసీ బస్సులను తగ్గించారనీ, తద్వారా ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతున్నదని చెప్పారు. విచ్చలవిడిగా నగరంలో మద్యం దొరుకుతున్నదనీ, దీంతో మందుబాబుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. రాత్రిపూట మహిళలను వేధిస్తున్నారని గుర్తు చేశారు. వారి అరాచకాలను అరికట్టాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక నిధులిచ్చి ఆర్టీసీని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నదనీ, సంబంధిత వ్యక్తులను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రేషన్‌షాపులకు వెళితే బియ్యం మినహా మరే ఇతర వస్తువులు ఇవ్వడం లేదన్నారు. గతంలో వస్తువులతోకూడిన సంచులు ఇచ్చే విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని సూచించారు.
మధ్యలో పాషా ఖాద్రీ పాయింట్ ఆఫ్ ఆర్డర్
మౌజంఖాన్ పద్దులపై మాట్లాడుతుండగానే ఎంఐఎంకు చెందిన మరో ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. పద్దులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖల మంత్రులు సభలో లేకపోవడం సరికాదనీ, వారిని వెంటనే పిలిపించాలని స్పీకర్‌కు సూచించారు.
నవ్వులు పూయించిన జీవన్‌రెడ్డి
పద్దులపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి శాసనసభలో నవ్వులు పూయించారు. టీఆర్ఎస్ పరిపాలనా కాలం, సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేతల గురించి, సభలో లేని ఎంపీ అర్వింద్‌కుమార్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పేర్లను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. రకరకాల సామెతలు, జోకులతో సభ్యులను నవ్వించారు. ప్రభుత్వం ప్రజలకోసం భారీ నిధులు ఖర్చుపెడుతున్నదనీ చెప్పారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ హయాం... నాటి కాకతీయులు, గుప్తుల తరహాలో స్వర్ణయుగం లాంటిదని వ్యాఖ్యానించారు. నిబద్ధత, అకుంఠితదీక్షతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ను ఆధునిక ఆభినవ దేవుడిగా అభివర్ణించారు. ప్రభుత్వ పథకాలు అన్ని రకాల తరగతులకు సమానంగా అందుతున్నాయని చెప్పారు. రైతులపై బుల్డోజర్లను ఎక్కించి తొక్కిస్తున్న పార్టీ బీజేపీ అని, కాంగ్రెస్ కాలంలో కరెంట్ కోసం పోరాడిన రైతులపై కాల్పులు జరిపారని గుర్తు చేశారు.