Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్దులపై చర్చలో కాంగ్రెస్ సభ్యులు దూద్దిళ్ల శ్రీధర్‌భాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్ రైతుల ప్రాణాలు తీస్తున్నదని కాంగ్రెస్ సభ్యులు దూద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. భూవివాదాలు సృష్టిస్తున్నదని చెప్పారు.ప్రయివేటు భూములు సైతం నిషేధిత జాబితాల్లో పొందుపరిచారని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై ఆయన మాట్లాడారు. మంత్రి వర్గ ఉపసంఘం గుర్తించిన 20 లోపాలను సైతం సరిదిద్దలేదన్నారు. దీంతో భూవివాదలు వస్తున్నాయన్నారు. వీటిని పరిష్కరించాలని కోరుతూ ఐదు లక్షల ఆర్జిలు వచ్చాయని గుర్తు చేశారు. భూదానబోర్డును రద్దు చేయడంతో ఆ భూములకు రక్షణ లేకుండాపోయిం దని ఆందోళన వ్యక్తం చేశారు. చిరువ్యాపారులకు జీఎస్టీ 20 లక్షల నుంచి 40 లక్షల పరిమితి పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదని చెప్పారు. అబ్కారి శాఖను ఆదాయవనరుగా మార్చివేసిందని విమర్శించారు. మద్యం అమ్మకాల కోసం టార్గెట్టు పెడుతున్నారని చెప్పారు. లిక్కర్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నదనీ, ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీజీపీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరిగాయని చెప్పారు. మహిళలపై అకృత్యాలు నిత్యం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ఆరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 12 నుంచి 15 లక్షల మంది కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని కోరారు. నష్టపోయిన మిర్చి రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్‌షాపులు బియ్యం షాపులుగా మారాయనీ, వాటిలో సరుకులకు సంఖ్యను పెంచాలని కోరారు.