Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృష్ణా నీరు మొత్తం ఆంధ్రాకే...: మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి
- ఎండిపోయిన పంటల పరిశీలన
నవతెలంగాణ - కందనూలు
నీటి వాటాను పొందడంలో రాష్ట్రం వైఫల్యం చెందడం వల్లే కృష్ణా నీరు మొత్తం ఆంధ్రాకు తరలిపోయిందని మాజీ మంత్రి.. కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఫలితంగా వేసవి రాకముందే పైర్లు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, తాడూరు మండలాల్లో కాల్వ కింద రైతులు వేసిన వరి, మొక్కజొన్న, మినుము, ఆముదం, వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. సాగు పెట్టుబడులు.. పంట దిగుబడులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీరుతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నో ఉద్యమాల ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధించామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు రహిత జిల్లాగా మార్చేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించిందన్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అందులో భాగంగానే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, పిల్ల కాల్వల నిర్మాణాలు చేపట్టలేదన్నారు. దాని పర్యవసానమే నేడు తాగు, సాగునీటికి మళ్లీ కటకట ఏర్పడిందన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో కృష్ణా జలాలు అడుగంటిపోయాయన్నారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కల్వకుర్తి ప్రాజెక్టు నీటి పంపింగ్‌ను ఎందుకు నిలుపుదల చేసిందో చెప్పాలన్నారు. ప్రభుత్వం మాటలు నమ్మి ప్రాజెక్టు కింద వేసుకున్న పంటలన్నీ ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పర్యటన సందర్భంగా రైతులు సాగు కోసం ఎంత ఖర్చు చేశారో అడిగి తెలుసుకున్నారు. నీటి కోసం కాల్వలో దించుకున్న మోటార్లకు విద్యుత్ శాఖ అధికారులు డీడీలు కట్టించుకున్నారుగానీ కాల్వలో నీరు రాదన్న విషయాన్ని చెప్పకపోవడం దుర్మార్గమన్నారు.
వీరందరి కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, లేకుంటే రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈయన వెంట నాయకులు అర్థం రవి, రోహిణి రెడ్డి, కోటయ్య, రైతులున్నారు.