Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28, 29న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-భువనగిరిరూరల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల జాతీయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28, 29న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో పరిశ్రమల యూనియన్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి, కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తున్న దివాలా కోరు విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. నేషనల్ మేనిటైజేషన్ పైప్లైన్ పేరుతో మౌలిక వసతులను, సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ అనుకూల విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి ఎండి.పాషా తదితరులు పాల్గొన్నారు.