Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు ఆస్పత్రుల్లో 56 శాతం నార్మల్ డెలివరీ
- ప్రయివేటు ఆస్పత్రుల్లో 22 శాతమే..దీనిపై ఎమ్మెల్యేలు దృష్టిపెట్టాలి: ప్రశ్నోత్తరాల సమయంలో హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి కొమురం భీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. కేసీఆర్ కిట్ పథకం వచ్చిన తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లోనే 54 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే ఇవి 24 శాతం పెరిగాయని తెలిపారు. ఈ పథకం కింద 2017 నుంచి ఇప్పటిదాకా 13,29,951 మందికి లబ్ది చేకూరిందని తెలిపారు. రూ. 1387.19 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రాష్ట్రంలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి లక్ష ప్రసవాల్లో తల్లుల మరణాల సంఖ్య 94 ఉండేదనీ, ప్రసవ మరణాలను స్వరాష్ట్రంలో 63కి తగ్గించుకోగలగటం గొప్ప మార్పు అన్నారు. దేశ సగటుతో చూస్తే అది 113గా ఉందని వివరించారు. రాష్ట్రంలో శిశుమరణాల రేటు గతంలో 39గా ఉంటే దాన్ని 23కు తగ్గించుకోగలిగామని చెప్పారు. ఈ విషయంలో దేశ సగటు 35గా ఉందని తెలిపారు. నెలన్నరలో మెదక్‌లో మాతాశిశు ఆస్పత్రిని పూర్తిచేస్తామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రసవాలు 80 శాతం జరుగుతాయనీ, అది మాతా, శిశుకు ఆరోగ్యకరమని తెలిపారు. దాన్ని అందుకునే దిశగా తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. పుట్టిన గంట లోపే పాలు పడితే బిడ్డలకు మంచిదనీ, సాధారణ ప్రసవాలు జరిగితేనే అది సాధ్యం అవుతుందని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో 56 శాతం సాధారణంగా, 44 శాతం ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో 78 శాతం సిజేరియన్ల ద్వారానే ప్రసవాలు జరగటం ఆందోళనకరమన్నారు. ఈ విషయంపై ప్రజలను చైతన్యపరుస్తూ, ప్రయివేటు ఆస్పత్రుల్లో ఎక్కువ సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడంపై ఎమ్మెల్యేలు దృష్టిసారించాలని సూచించారు.