Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిదశలోనే 60 శాతం విద్యార్థులకు ప్రయోజనం
- ప్రతి మండలంలోనూ ఎక్కువ విద్యార్థులున్న 35 శాతం పాఠశాలల ఎంపిక
- ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మూడు దశల్లో మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి పథకాలను పూర్తిచేస్తామనీ, దీంతో తొలిదశతోనే 60 శాతం విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. శుక్రవారం శాసనసభలో టీఆర్ఎస్ సభ్యులు సుంకె రవి శంకర్, జైపాల్‌యాదవ్, కేపీ వివేకానంద, ఎ.అంజయ్య, బాపూరావు రాథోడ్, రవీందర్‌నాయక్, గ్యాదరి కిశోర్, రెడ్యానాయక్, ఎంఐఎం సభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రి, తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి వీలుగా మన ఊరు-మనబడి, మన బస్తీ- మనబడి పథకాలను మూడేండ్లలో మూడు దశల్లో అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం లో నీటిసరఫరాతో కూడిన టాయిలెట్లు, విద్యు ద్ధీకరణ, తాగునీటిసరఫరా, ఫర్నీచర్, పెయిం టింగ్, మరమ్మతులు, గ్రీన్‌చాక్‌బోర్డుల ఏర్పాటు, శిథిలావస్థలో ఉన్న తరగతి గదులస్థానంలో కొత్త గదులు, ప్రహరీలు, వంటషెడ్ల నిర్మాణాలు, ఉన్నతపాఠశాలల్లో డైనింగ్ హాళ్లు,డిజిటల్ తరగతుల ఏర్పాటు వంటి 12 అంశాల వారీగా పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. దీనికిగానూ రూ.7289.54 కోట్లు కేటాయించగా..ఈ ఏడాది రూ.3497.62 కోట్లతో పనులు చేపడతామని చెప్పారు. నియోజకవర్గాల వారీగా ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలను ఎంచుకుని ప్రతి మండలంలో 35 శాతం చొప్పున ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లను ఎంపికచేసి అభివృద్ధి చేస్తామన్నారు. మొత్తం విద్యార్థుల్లో వాటిలోనే 60 శాతం మంది చదువుతున్నారని చెప్పారు. ఇంగ్లీష్‌మీడియం స్కూళ్లను నిర్వహిస్తామన్నారు. ఎవరైనా పాఠశాలలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తే కమిటీలో శాశ్వతంగా పేరు చేరుస్తామనీ, ఎవరైనా ముందుకొచ్చి ప్రాథమిక పాఠశాలలకు రూ.25 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.50 లక్షలు, హైస్కూళ్లకు కోటి రూపాయల చొప్పున సహాయం అందిస్తే వారు సూచించిన పేర్లను స్మారకార్ధకంగా పెడతామని చెప్పారు. పల్లెప్రగతి కింద గ్రామంలోని పారిశుధ్య కార్యక్రమాలన్నింటినీ సర్పంచ్ నేతృత్వంలోని గ్రామపంచాయతీనే చూస్తున్నదనీ, పాఠశాలల పారిశుధ్యం కూడా పంచాయతీ మెయింటనెన్స్ తోనే చేపట్టాలనేది విధానపర నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా ఏంఈఓల భర్తీ పూర్తవుతుందన్నారు.