Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.రమణ
నవతెలంగాణ- నల్లగొండ
రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి నామమాత్రపు కేటాయింపులు చేసి గొప్పగా చేసినట్టు చెప్పడం విడ్డూరంగా ఉందని, కేటాయింపులు పెంచాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.రమణ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు చౌగాని సీతారాములు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గీత కార్మికులకు వంద కోట్లతో ప్రత్యేక పథకం పెడతామని చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు.. బడ్జెట్ పద్దులలో మాత్రం టాడి కార్పొరేషన్‌కు రూ.30 కోట్లు, నీరా పాలసీకి రూ.25 కోట్లు మాత్రమే చూపించారన్నారు. ఐదు లక్షల కుటుంబాలు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, ఆ నిధులు ఏమాత్రం సరిపోవని అన్నారు. ప్రతి సొసైటీకీ చెట్ల పెంపకానికి భూమి, కల్లుకు మార్కెట్ సౌకర్యం, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్లు పైబడిన గీత కార్మికులు పింఛన్ కోసం దరఖాస్తులు పెట్టుకొని రెండేండ్లు దాటినప్పటికీ ఇవ్వడం లేదన్నారు. వెంటనే వారికి పింఛన్ ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్‌గౌడ్ మాట్లాడుతూ.. గీత కార్మికులకు మోపెడ్ వాహ నాలు ఇస్తామని కొంత కాలంగా పదే పదే చెబుతున్నారు తప్ప ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతి కార్మికునికీ బైకు ఇవ్వాలన్నారు. గీత కార్మికులు రెక్కల కష్టంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, సెంటు భూమి లేని వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారని అన్నారు. గీత కార్మికులకు కూడా గీతబంధు పేరుతో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు బీమాలాగే గీతన్న బీమా ప్రభుత్వమే చేయాలన్నారు. వెంటనే ఎక్స్‌గ్రేషియా అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామాల్లో విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్టుషాపులను నిరో ధించాలన్నారు. దశలవారీగా మధ్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గీత కార్మికులందరినీ సమీకరించి పెద్దఎత్తున ఉద్య మం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పి.అచ్చాలు, పుల్లయ్య, రాచకొండ వెంకట్‌గౌడ్, నర్సింగ్ సైదులు, కాట్నం యాదగిరి, కొప్పు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.