Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈవోల వద్ద సీనియార్టీ జాబితాలు
- సర్వీసు రూల్స్ రూపకల్పనలో అధికారులు
- 10,159 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం
- ఉపాధ్యాయ సంఘాలతో త్వరలో సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు రంగంసిద్ధమైంది. 'త్వరలోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తాం. దేశానికే ఆదర్శంగా సరళంగా పదోన్నతులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ రూపొందిస్తాం.'అని ఈనెల ఎనిమిదో తేదీన వనపర్తిలో 'మన ఊరు-మనబడి' కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా శుక్రవారం విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన హాజరయ్యారు. 317 జీవో ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు, జిల్లాలకు కేటాయింపు ప్రక్రియ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. దీంతో కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు డీఈవోల వద్ద సిద్ధంగా ఉన్నాయి. అయితే కొత్త జిల్లాలు, కొత్త జోనల్ విధానం ప్రకారం ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ తయారు చేయాల్సి ఉంటుంది. వాటిని రూపొందించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. సీనియార్టీ జాబితాల్లో తప్పుల్లేకుండా చూడాలని డీఈవోలకు సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు రాబోతున్నాయని తెలుస్తున్నది. ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 10,159 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశమున్నది. రాష్ట్రంలో 8,270 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. ఇందులో 30 శాతం పోస్టులు నేరుగా, మిగిలిన 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. దీంతో 5,789 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభిస్తాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు వంద శాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలి. 1,970 మందికి గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతులు వస్తాయి. ఎస్జీటీలకు వందశాతం పదోన్నతుల ద్వారా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు 2,400 వరకు లభించే అవకాశమున్నది. ఇవన్నీ కలిపితే 10,159 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయి. గతంలో 10 వేల ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులను మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం 4,500 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులున్నాయి. అందులో 2,500 మంది మాత్రమే రెగ్యులర్ హెచ్ఎంలుగా పనిచేస్తున్నారు. మిగిలిన రెండు వేల స్కూళ్లలో ఇన్ఛార్జీలు కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మరో 5,500 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు మంజూరైతే 5,500 మంది ఎస్జీటీలకు పదోన్నతులు వస్తాయి. ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం కోర్టులో ఉన్న కారణంగా ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్, బీఈడీ లెక్చరర్ వంటి పోస్టులకు పదోన్నతులు లభించే అవకాశం లేదు. ఇంకోవైపు గ్రేడ్-2 భాషా పండితులు, పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)లుగా ప్రభుత్వం ఉన్నతీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశం కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్న ఆ కేసును వెకేట్ చేయిస్తేనే 8,630 భాషా పండితులు, 1,849 పీఈటీలు కలిపి 10,479 మందికి స్కూల్ అసిసెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశమున్నది.