Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితకు ఎస్జీటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలలు, విద్యారంగంతోపాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎస్జీటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, టి హరీశ్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డిలను వేర్వేరుగా ఎస్జీటీయూ అధ్యక్షులు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామపంచాయతీకొక ఆదర్శ ప్రాథమిక పాఠశాల, ప్రధానోపాధ్యాయుడు, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాధారణ బదిలీలతోపాటు పదోన్నతులు కల్పించాలని సూచించారు. పండితుల అప్‌గ్రెడేషన్‌లో అర్హత ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో అవకాశం కల్పించాలని తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని సూచించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా అవకాశం కల్పించాలని తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువున్న ప్రాథమిక పాఠశాలల్లో భోజనశాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంత్రులు సానుకూలంగా స్పందించారని వివరించారు.