Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ నుంచి బడ్జెట్ సమావేశాల మొత్తం సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన కేసులో స్టే ఆదేశాల జారీకి హైకోర్టు నిరాకరించింది. సభలో సభ్యులు ఆటంకం కల్పిస్తే సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు, సభకు ఉందని చెప్పింది. ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని చెప్పింది. చట్ట ప్రకారం సస్పెండ్ చేయబోయే సభ్యుల పేర్లను స్పీకర్ చదవాలని, అయితే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లను చదివారని చెప్పి స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరడం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పింది. ఎవరైనా సభ్యుడు సభలో ఆటంకం కల్పిస్తే స్పీకర్ చర్యలు తీసుకోవచ్చునని, సభ్యులు కూడా తీర్మానం ప్రవేశపెడితే సభ ఆమోదంతో సస్పెండ్ చేయవచ్చునని హైకోర్టు నిబంధనలను గుర్తు చేసింది. ఈ కారణంగా బీజేపీ ఎమ్మెల్యేల స్టే పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. సభలో రాజ్యాంగ వ్యతిరేకంగా చేశారనే అభియోగాలపై లోతుగా విచారణ చేస్తామని, ఇందులో భాగంగా ప్రతివాదులైన అసెంబ్లీ కార్యదర్శి,అసెంబ్లీ సచివాలయ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ షమీమ్‌అక్తర్ కీలక ఉత్తర్వులిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేల తరఫున సీనియన్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ప్రధాన కేసు విచారణను వాయిదా కోర్టు వాయిదా వేసింది.
రాజాసింగ్‌పై కేసు కొట్టివేత
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన రిట్‌ను హైకోర్టు కొట్టేసింది. 2018లో ఎన్నికల నామినేషన్లల్లో తనపై 47 కేసులే ఉన్నాయని రాజాసింగ్ చెప్పారనీ, వాస్తవానికి అప్పటికే ఆయనపై 51 కేసులున్నాయని ఆయనపై పోటీచేసి ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్‌సింగ్ రాథోడ్ ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని శుక్రవారం జస్టిస్ పీ నవీన్‌రావు కొట్టేశారు.
ఆర్కెపై పుస్తకం సీజ్ సరికాదు
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకష్ణ (ఆర్కె) జ్ఞాపకార్ధం ఆయన భార్య శిరీష ప్రచురించిన సాయుధ శాంతి స్వప్నం పుస్తకాన్ని జప్తు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సీజ్ చేసిన పుస్తకాలను వెంటనే ఇచ్చేయాలని అంబర్‌పేట పోలీసులను ఆదేశించింది. నవ్య ప్రింటర్స్‌లో సోదాలు చేసి సీజ్ చేసిన వాటిని అప్పగించాలని చెప్పింది. ఈ మేరకు జస్టిస్ లక్ష్మణ్ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రెస్ అధినేతపై పోలీసుల కేసును కూడా కొట్టేశారు.