Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభలో ఏకగ్రీవ తీర్మానం చేయండి
- ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచండి
- గమ్ముగా ఉంటే బెల్, బీడీఎల్, హైదరాబాద్‌లోని ఇతర సంస్థలనూ అమ్మేస్తారు
- దేశసంపద కొందరివద్దే పోగుపడొద్దనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
- నేడు కొందరి చేతుల్లోనే సంపద పెట్టే పనికి బీజేపీ దిగింది :అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి
- దేశ సంపదనను అంబానీ, ఆదానీలకు అప్పగించేస్తున్నారు : శ్రీధర్‌బాబు
- నష్టాల్లోకి నెట్టి సింగరేణిని ప్రయివేటీకరించే కుట్ర : బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణ సంస్థ రక్షించుకునేందుకు కలిసికట్టుగా ముందుకెళ్దామనీ, దీనిపై సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీకి అఖిల పక్షాన్నితీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనీ, గమ్ముగా ఉంటే బెల్, బీడీఎల్, హైదరాబాద్‌లోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలనూ మోడీ సర్కారు అమ్మేస్తుందని హెచ్చరించారు. అలా చేస్తే వాటి ఆధారంగా నడుస్తున్న అనుబంధ పరిశ్రమలు మాటేంటి? వాటిపై ఆధారపడి బతుకుతున్న వారి జీవితాలు ఏం కావాలని ప్రశ్నించారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భట్టి మాట్లాడుతూ..దేశ సంపద కొందరి వద్దనే పోగుపడొద్దనే ఉద్దేశంతోనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తొలి ప్రధాని నెహ్రూ తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుదు దీనికి విరుద్ధంగా దేశ సంపదను కొందరి చేతుల్లోనే పెట్టే పనికి బీజేపీ పూనుకున్నదని విమర్శించారు. దేశ సంపదను పోగేస్తున్న ప్రభుత్వ రంగసంస్థలన్నింటిని కూడా తెగనమ్మేసి కొద్ది మంది చేతుల్లో సంపద పెట్టాలనే ఆలోచనలో భాగమే సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రయివేటీకణ అన్నారు. ఆ సంస్థ యాజమాన్యం బ్లాకులను అడుగుతున్నా..ప్రయివేటుకు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను, సింగరేణిని కాపాడుకోవాలనుకునే వాళ్లందరూ కలిసిపోరాడాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. గుజరాత్ రాష్ట్రం బ్లాకులు అడగ్గానే మోడీ సర్కారు వెంటనే ఇస్తుందా? తెలంగాణ రాష్ట్రం అడిగితే ఇవ్వదా? ఏంటీ వివక్ష? ఏం పాపం చేసింది తెలంగాణ? అని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఆధారంగా ఎంతో మంది జీవితాలు పెనవేసుకుని ఉన్నాయని చెప్పారు. సింగరేణిని మూసేసి ప్రయివేటీకరించే ఆలోచనను బీజేపీ చేస్తున్నదని ఆరోపించారు. ఇలాగే చూస్తూ ఉంటే అన్నింటినీ అమ్మేస్తారని హెచ్చరించారు. సింగరేణి కోల్ మైన్ వ్యవస్థనే కాదనీ, తెలంగాణ ఆత్మ అని అన్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సింగరేణి దగ్గర కావాల్సినంత టెక్నాలజీ ఉన్నా.. ఎందుకు ఇవ్వరంటూ కేంద్రాన్ని నిలదీద్దామన్నారు. బ్లాకులను సింగరేణి తెచ్చుకోవడమే కాకుండా ఆపరేట్ చేయాలనీ, ప్రయివేటుకు ఇవ్వొద్దని కోరారు. ఒడిశాలోని నైనీ సంస్థ బ్లాకుల యాక్షన్ విషయంలో అవకతవకలు జరిగాయనే ప్రచారం జరుగుతున్నదనీ, అది వాస్తవమా? కాదా? సభకు చెప్పాలని అడిగారు. పేదవాని సంపదను కొల్లగొట్టాలని చూసినా, సంపదను ధనవంతుకులకు అప్పజెప్పాలని చూసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సింగరేణి రక్షణ కోసం సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..ఆత్మనిర్భర్ భారత్ అంటూ బేచో ఇండియా నినాదంతో మోడీ సర్కారు ముందుకు పోతున్నదని విమర్శించారు. ఎల్ఐసీ, ఎయిర్ఇండియా, విశాఖ స్టీల్ లాంటి తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఇద్దరు పారిశ్రామిక వేత్తలకు దేశాన్ని నేడు మోడీ సర్కారు అమ్మేస్తున్నదనీ, ఆదానీ, అంబానీలకు దేశాన్ని అప్పగించే పనిలో ఉందని విమర్శించారు. రాష్ట్రానికీ వాటా ఉన్న నేపథ్యంలో బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరించకుండా లాభాల్లో ఉన్న సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సభ్యులు బాల్క సుమన్ మాట్లాడుతూ..బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టడమంటే సింగరేణిపై కక్ష గట్టడమేనన్నారు. సింగరేణి ఆస్తులను అమ్మేడం అన్యాయమన్నారు. ఆ సంస్థను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఇట్లాగే ఊరుకుంటే సింగరేణిలో మరో 14 బ్లాకులను ప్రయివేటీకరించే ప్రమాదముందని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఐరన్ఓవర్ మైన్ కావాలని అడిగితే 22సార్లు లేఖ పెట్టినా కేంద్రం కేటాయించలేదన్నారు. సింగరేణిని కూడా ఇలాగే నష్టాల్లోకి నెట్టి అమ్మేయాలనే కుట్ర దాగి ఉందన్నారు. ఈ చర్చలో ఇతర సభ్యులు కాంగ్రెస్ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, దివాకర్‌రావు, కోరుకంటి చందర్, తదితరులు పాల్గొన్నారు.