Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
- వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నట్టు నిర్ధారించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యశోద ఆస్పత్రి వైద్యులు, ఫిజిషీయన్ ఎం.వీ.రావు, హృద్రోగ నిపుణుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు గుండె సంబంధిత సమస్యలేవి లేవని స్పష్టం చేశారు. గత రెండు రోజుల నుంచి బలహీనంగా ఉన్నాననీ, ఎడమ చేయి నొప్పిగా ఉందని సీఎం తెలిపినట్టు ఆస్పత్రి మెడికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ విష్ణురెడ్డి తెలిపారు. దీంతో ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించామని చెప్పారు కేసీఆర్‌కు ఫిజిషీయన్ డాక్టర్ ఎంవీ రావు, కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్‌తో కూడిన వైద్య బృందం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి అలసటగా ఉన్నట్టు చెప్పిన ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం ఎడమ చేయి నొప్పిగా ఉందనడంతో ప్రగతి భవన్‌కు వెళ్లి పరిశీలించామన్నారు. ఆస్పత్రిలో యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించామనీ, వాటి ఆధారంగా ఎలాంటి బ్లాక్స్ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు కూడా నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రి గుండెకు సంబంధించిన రక్తపరీక్షలు నిర్వహించామనీ, దాని పనితీరు బాగుందని వివరించారు. ఆ పరీక్షల రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు. గుండెకు సంబంధించి ఎలాంటి సమస్య లేకపోవడంతో ఎడమ చేయి నొప్పి ఎందుకు వచ్చిందనే విషయం తెలుసుకునేందుకు మెడకు, బ్రెయిన్‌కు సంబంధించి ఎంఆర్ఐ టెస్టులు కూడా చేశామని తెలిపారు.
జనరల్ ఫిజిషీయన్, సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వీ.రావు మాట్లాడుతూ కేసీఆర్ ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్ చేసి నీరసంగా ఉందంటూ తెలిపారని అన్నారు. ఎడమ చేయి లాగుతున్నదని ఆయన చెప్పారు. దీంతో తాను, డాక్టర్ ప్రమోద్ ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నామన్నారు. ప్రివెంటివ్ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించాం. యాంజియోగ్రామ్ పరీక్షల తర్వాత బ్రెయిన్, స్పైన్‌కు సంబంధించి ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించాం. అదష్టవశాత్తు కేసీఆర్‌కు ఎలాంటి కార్డియో ప్రాబ్లం లేదు. ఎంఆర్ఐ బ్రెయిన్ రిపోర్టు కూడా నార్మల్‌గానే ఉంది. ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్‌లో కొంచెం స్పాండిలోసిస్ ఉంది. ఇది వయసుతో పాటు వస్తుంది. కేసీఆర్ ఎక్కువగా వార్తా పత్రికలు చదువుతుంటారు. ఐ పాడ్ కూడా చూస్తుంటారు..దీంతో మెడ నొప్పి కారణంగా ఎడమ చేయిలో నొప్పి వచ్చింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించాం. అన్ని బాగానే ఉన్నాయి. గుండెతో పాటు కాలేయం, మూత్రపిండాల పనితీరు, కొలెస్ట్రాల్ లెవల్స్ బాగున్నాయి. బీపీ, షుగర్ నియంత్రణలో ఉన్నాయి. సీఎం ఆరోగ్యంగా ఉన్నారు. అందువల్ల వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని వివరించారు. ప్రతి ఏడాదీ కేసీఆర్‌కు ప్రివెంటివ్ చెకప్ చేస్తున్నామన్నారు. ఇక మీదట ప్రతి వారం రక్త పరీక్షలు నిర్వహించి గ్లూకోస్ లెవల్స్ పరిశీలిస్తామని వెల్లడించారు. డే కేర్ విధానంలో ఆస్పత్రిలో చేర్చుకుని పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత సీఎం కేసీఆర్ మరింత ఉత్సాహంతో పని చేస్తారని తెలిపారు. 90 శాతం పరీక్షల రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయనీ, మిగిలిన వాటి ఫలితాలు రావాల్సి ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రికి వెళ్లిన సీఎం వెంట సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్ రావు తదితరులున్నారు.