Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడికెళ్లినా మధ్యాహ్నభోజన కార్మికులు వేతనాల గురించి అడుగుతున్నరు
- మూడు గుడ్లొస్తలేవు..ఇచ్చే పైసలు పెంచండి
- స్కావెంజర్లను నియమించండి
- సభలో అధికార పార్టీ సభ్యుల మొర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పద్దులపై చర్చ సందర్భంలో ఆహా..ఓహో..అంటూ సర్కారును పొగుడుతున్నప్పటికీ..ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ సభ్యులు లేవనెత్తున్న అంశాలు క్షేత్రస్థాయిలోని వాస్తవిక పరిస్థితిని ఎత్తి చూపుతున్నాయి. శుక్రవారం శాసనసభలో 'మంత్రిగారూ..మా సమస్యల్నీ వినండి..స్పీకర్‌గారూ రెండు నిమిషాలు అవకాశమివ్వండి' అంటూ సభ్యులు పదేపదే అడగాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్రామపంచాయతీలకు పాఠశాలల టాయిలెట్స్ శుభ్రత బాధ్యతను అప్పగించారనీ, ఆ సిబ్బందినేమో సరిగా రాకుండా పట్టించుకోవట్లే దని టీఆర్ఎస్ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. స్కావెంజర్ల నియమించాలని విన్నవించారు. టీచర్ల వేకేన్సీ ఉన్న దగ్గర ఇబ్బంది కలుగకుండా విద్యావాలంటీర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరో సభ్యుడు అంజయ్య మాట్లాడుతూ..అంగన్వాడీ సెంటర్లలో వంటశాల సౌకర్యాలను కల్పించాలని కోరారు. రవీందర్‌నాయక్ , విద్యాసాగర్ మాట్లాడుతూ..ఏ ఊరెళ్లినా మధ్యాహ్నభోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని తమను వేడుకుంటున్నారని చెప్పారు. మిడ్డే మీల్స్ వర్కర్లకు వెయ్యి రూపాయల గౌరవవేతనాన్నే ఇస్తున్నారనీ, అదీ ఆరేడు నెలలు పెండింగ్‌లో ఉండటంతో వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. సమస్య చిన్నదే కావొచ్చు వాళ్లకు ఎంతో ఇబ్బందిగా ఉందన్నారు. వారి గౌరవ వేతనాన్ని పెంచాలని కోరారు. పాఠశాలల్లో పిల్లలకు వారానికి మూడు కోడి గుడ్లు పెట్టాలనే నిబంధన ఉందనీ, ఇది మంచి నిర్ణయమని చెప్పారు. ఈ నేపథ్యంలో కోడిగుడ్లకు ఇచ్చే పైసలను పెంచాలని కోరారు. పాఠశాలల్లో స్కావెంజర్లను, స్వీపర్లను నియమించాలని విన్నవించారు. 'రెగ్యులర్ ఎంఈఓలను ఎప్పుడు నియమిస్తారు' అని గ్యాదరి కిశోర్ అడిగారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..పల్లెప్రగతి కింద గ్రామంలోని పారిశుధ్య కార్యక్రమాలన్నింటినీ సర్పంచ్ నేతృత్వంలోని గ్రామపంచాయతీనే చూస్తున్నదనీ, పాఠశాలల పారిశుధ్య ం కూడా పంచాయతీ మెయింటనెన్స్తోనే చేపట్టాలనేది విధానపర నిర్ణయమని స్పష్టం చేశారు.