Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ ముగిశాక డబుల్ బెడ్రూం ఇండ్లు
- సొంత జాగా ఉంటే ఈనెల నుంచే రూ. 3 లక్షలు : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-కాప్రా
వచ్చేనెల నుంచే లబ్దిదారులకు కొత్త పింఛన్లను అందజేస్తామని, అసెంబ్లీ సమావేశాలు ముగిశాక నిర్మాణం పూర్తయిన డబుల్బెడ్రూం ఇండ్లను అందజేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సొంతంగా జాగా ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ప్రభుత్వం తరపున ఈ నెలలోనే ఇస్తామని చెప్పారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని, రూ.900 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఉప్పల్ చౌరస్తాలో రూ.450 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మల్లాపూర్‌లో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ''మన ఊరు- మన బడి'' కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ పెట్టామన్నారు. రూ.7,300 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని, ఈ ఏడాది నుంచే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం అవుతుందని అన్నారు. హైదరాబాద్‌కు చుట్టుపక్కల వెయ్యి పడకలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని, ఉప్పల్‌లో 22 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.35 కోట్లతో నిర్మించిన స్కైవాక్‌ను వచ్చే నెల ప్రారంభిస్తామన్నారు. ఒకప్పుడు వర్షాలు పడితే మూసీకి వరదలొచ్చి ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ప్రతి వర్షపు చుక్క మూసీలోకి వెళ్లేలా నాలాలు అభివృద్ధి చేశామని చెప్పారు. రూ.900 కోట్లకుపైగా నిధులు వెచ్చించి వ్యూహాత్మక నాలాలు అభివృద్ధి చేపట్టామన్నారు. రూ.3,866 కోట్లతో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నామని, నాచారంలో రూ.75 కోట్లతో ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నామని, ఉప్పల్ కూడలికి రెండు వైపులా పైవంతెనలు నిర్మాస్తున్నామని చెప్పారు. వచ్చే నెల చర్లపల్లి ఆర్యూబీ పూర్తి చేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.