Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ముస్లింలతో పాటు హిందూవులు, సిక్కులు, జైనులు, ఇతరుల సంక్షేమం కోసం కూడా తాము పోరాడుతామని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. పలు పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన ఊరు-మనబడి, మన బస్తీ-మనబడిలో పొందుపరిచిన మౌలిక సదుపాయాలన్నీ గత బడ్జెట్లో ప్రస్తావించనవేనన్నారు. దాంట్లో కొత్తదనమేమీ లేదని చెప్పారు. ప్రయివేటు స్కూళ్ల ఫీజుల వేధింపులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై రాష్ట్ర సర్కారు సరిగా స్పష్టతనివ్వలేదని విమర్శించారు. విద్యాశాఖలో 95 శాతం మంది ఎంఈవోలు ఇన్ చార్జీలేననీ, డీఈవోలు కూడా ఏడుగురే ఉన్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇలాగైతే విద్యపై పర్యవేక్షణ ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ఉర్దూ మీడియం పోస్టులకు ప్రత్యేక డీఎస్సీ వేయాలని కోరారు. పోటీ పరీక్షల పేపర్లను ఉర్దూ భాషలోనూ ముద్రించాలన్నారు. టెట్ నిర్వహించాలని కోరారు. వీసీల్లో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరిగాదన్నారు. ఓయూ వక్ఫ్భూముల్లోనే ఉందనీ, ముస్లింల కాలనీలకు వెళ్లే రోడ్లు, మజీద్, ఖబర్‌స్తాన్‌కు వెళ్లే దారులన్నీ మూసేయడం తగదని సభ దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు స్టే ఇచ్చినా కొత్తపేట పండ్ల మార్కెట్ కూల్చడం తగదన్నారు. దీనివల్ల పండ్ల వ్యాపారులు, నిరుపేదల బతుకులు రోడ్లమీద పడ్డాయన్నారు. వ్యాపారుల ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైతే 30 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూములిస్తామనీ, కొత్త మార్కెట్ ఏర్పాటయ్యే వరకు వారికి అందులో తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాకు స్పోర్ట్స్ స్కూలు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.