Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్
- కస్సుమంటున్న టీఆర్ఎస్
- తటస్థంగా ఎంఐఎం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. సభలో ఎక్కడా ప్రభుత్వ ధిక్కార స్వరం వినిపించకుండా అధికారపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని కాంగ్రెస్ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే తిప్పికొడ్తూ 'మీకర్థం కావట్లేదు' అంటూ అధికారపార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తుంది. తాము చెప్పదలుచుకున్న విషయాలను అతి సున్నితంగా అయినా సభ దృష్టికి తీసుకెళ్లాలనే తపన కాంగ్రెస్ సభ్యుల్లో కనిపిస్తోంది. వారు ప్రశ్నిస్తే...చిక్కుల్లో పడతామని గమనించగానే మంత్రులు ప్రభుత్వ సమర్ధింపు వాక్యాలతో పాటు 'అప్పట్లో' అంటూ ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ వైఫల్యాల చిట్టా విప్పుతూ ఎదురుదాడికి దిగుతున్నారు. సంఖ్యాబలం లేకపోవడం, ఏది మాట్లాడినా అది తిరిగి తమకే కౌంటర్ ఎటాక్‌గా మారడంతో ప్రతిపక్షానికి ఇబ్బందిగానే మారింది. ఇక టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన మంత్రులు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ సభ్యుల కౌంటర్ల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధుల అంశం సభలో చర్చకు వచ్చినప్పుడు ఈ తరహా ఇబ్బందే పార్టీ మారిన మంత్రులకు ఎదురయ్యింది. దాన్ని కవర్ చేసుకొనేందుకు మళ్లీ సీనియర్ మంత్రులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇక సభలో సభ్యులు చెప్తున్న 'పిట్ట కతలు' ఆసక్తిగా ఉంటున్నాయి. సభ సీరియస్‌నెస్‌ను తేలికపరుస్తున్నాయి. ఎంఐఎం సభ్యులు లేవనెత్తుతున్న అంశాలు వాస్తవానికి దగ్గరిగా ఉన్నా, వాటిపై స్పష్టమైన హామీలు ప్రభుత్వం నుంచి పొందలేకపోతున్నారు. ఆరోగ్య కారణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం శాసనసభకు హాజరుకాలేదు. శాసనమండలికి సెలవు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ ప్రశ్నోత్తరాలతో పాటు పద్దులపై చర్చనూ చేపట్టింది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా సభ ఇంకా కొనసాగడం గమనార్హం. ఎక్కువ గంటలు సభను నిర్వహించి, తక్కువ రోజుల్లో ముగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదివారం సభకు సెలవు. తొలి షెడ్యూల్ ప్రకారమైతే అసెంబ్లీ ఈనెల 15 వరకే జరుగుతాయి. అంటే మంగళవారంతో బడ్జెట్‌కు ఆమోదం పొందగానే సభను ముగించే అవకాశాలు ఉన్నాయి. రవాణాశాఖ, పురపాలకశాఖ, మన ఊరు-మన బడి వంటి అంశాలపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల సూటి ప్రశ్నలకు, ఆ శాఖల మంత్రులు సమర్థించుకొనే ధోరణిలోనే సమాధానాలు చెప్పారు. తాము అడిగింది అది కాదని ప్రశ్న వేసిన సభ్యులు చెప్తున్నా, ఆ మాటలు పట్టించుకోకుండా, అధికారపక్షం తాను చెప్పదలుచుకున్న విషయాలనే సభలో ఏకరువు పెట్టడం గమనార్హం. గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు, ఆర్టీసీ బస్సుల తగ్గింపు వంటి అనేక సమస్యలు సభలో చర్చకు వచ్చాయి. అయితే రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ సమస్యల తీవ్రతను గుర్తించినట్టు కనిపించలేదు. మేడారం జాతరకు బస్సులు తిప్పితే ఆదాయం రాలేదన్న మంత్రి, మినీ బస్సులు తిప్పడంలో విఫలమయ్యారని ఎంఐఎం సభ్యుల ప్రస్తావిస్తే, 'రోడ్లు విశాలంగా ఉన్నాయి...ఇక మినీ బస్సులు ఎందుకు...డబుల్ డెక్కర్లే తిప్పుతాం' అని చెప్పడం సమస్యల దాటవేతను గుర్తుచేసినట్టు అయ్యింది. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులు, స్కావెంజర్ల సమస్యల్ని అధికారపక్ష సభ్యులే సభలో లేవనెత్తడం సమస్యల తీవ్రతకు అద్దం పట్టింది. సభానాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య కారణాలతో సభకు రాకపోవడంతో మంత్రి కేటీఆర్ అన్నీ తానై సభలో వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై కఠినంగానే విమర్శల దాడి చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్‌పైనా ఎదురుదాడి చేశారు. బీజేపీ సభ్యుల్ని తొలిరోజే సభ నుంచి సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.