Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్కట్పల్లిలో సాగిన షర్మిల పాదయాత్ర
నవతెలంగాణ- నార్కట్పల్లి
ముఖ్యమంత్రి రైతుబంధు, సబ్సిడీ రుణాలు వంటివి భూములు ఉన్నవారికే ఇస్తున్నారుగానీ.. కష్టం చేసుకుని బతికే చేనేత కార్మికులకు ఎటువంటి రాయితీలూ ఇవ్వడం లేదని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల అన్నారు. కార్మికులకు రోజుకు రూ.200 కూలి కూడా రావడం లేదన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని పోతినేనిపల్లె గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పల్లె నుంచి మొదలైన పాదయాత్ర నెమ్మాని గ్రామంకు చేరుకోగానే ప్రజలు స్వాగతం పలికారు. అక్కడ చేనేత కార్మికుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటంతో వారి ఇండ్లలోకి వెళ్లి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధానాల వల్ల తమ బతుకులు చితికి పోతున్నాయని కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం జువ్విగూడెంలో చిన్నారుల్ని, మహిళల్ని పలకరిస్తూ ముందుకు సాగారు. పెరుగుతున్న ధరలతో రోజువారి జీవితం అతలాకుతలం అవుతుందని మహిళల చెప్పారు. అధైర్య పడొద్దు, రానున్నది రాజన్న కాలం అంటూ షర్మిల అన్నారు. మధ్యాహ్నం పాదయాత్ర మాండ్రకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఏపూరి సోమన్న, సీనియర్ నాయకులు గట్టు రాంచందర్రావు, చంద్రహాస్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నీలం రమేష్ గారు, నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ ఇంజాం నర్సిరెడ్డి, భువనగిరి కోఆర్డినేటర్ మహమ్మద్ అత్తార్ తదితరులు పాల్గొన్నారు.