Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-నల్లగొండ
మతోన్మాదుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డికొమరయ్య భవనంలో నిర్వహించిన కేవీపీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ సర్కార్ పథకం ప్రకారమే దళితులకు ఉన్న రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ రిజర్వేషన్లకు సమాధి చేస్తోందన్నారు. దళితుల ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ నోటి కాడి బుక్క లాగేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనేది కేసీఆర్ మాటలైతే.. బీజేపీకి రాజకీయ సైద్ధాంతిక పునాది ఉందన్నారు. బీజేపీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని, స్వాతంత్య్ర జెండాను ఎప్పుడూ గౌరవించలేదన్నారు. రాష్ట్రంలో 18లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మాదిరిగానే దళితులకు 300యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. మూడెకరాల భూమి వాగ్దానం మున్నాళ్ల ముచ్చటగా మారిందన్నారు. నల్లగొండ జిల్లాలో 276 కుటుంబాలకు మాత్రమే భూమి పంపిణీ చేశారని తెలిపారు. ఈ సమావేశంలో కేపీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా నగేష్, జిల్లా ఉపాధ్యక్షులు దైదా శ్రీనివాస్, గాదే నర్సింహా, బొట్టు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.