Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధ ప్రాతిపదికన కదిలిన అధికార యంత్రాంగం
- నవతెలంగాణ' కథనానికి మంత్రి స్పందన
నవతెలంగాణ-తాడ్వాయి
'తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి' శీర్షికతో నవతెలంగాణలో ప్రచురితమైన కథనానికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఏజెన్సీలో సొసైటీ లేని పరిస్థితిలో కార్మికుడి కుటుంబానికి పరిహారం అందే అవకాశం లేని దుస్థితిని పత్రిక కథనంలో వివరించడంతో మంత్రి చొరవ తీసుకుని స్పందించారు. ఆయన ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కదిలింది. కార్మికుడి కుటుంబాన్ని ఎక్సైజ్ సీఐ సుధీర్ కుమార్ శనివారం పరామర్శించి తక్షణ సాయంగా రూ.10 వేలు అందించారు. కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, తాము సైతం తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్బాక గ్రామానికి చెందిన పేద గీత కార్మికుడు బుర్ర కనకయ్య శుక్రవారం తాడి చెట్టు పైనుంచి జారిపడి మృతిచెందిన విషయం తెలిసిందే. అతడి మృతిని, కుటుంబ పరిస్థితిని, ఏజెన్సీలో సొసైటీలు లేకపోవడం.. పరిహారం అందే అవకాశం లేకపోవడాన్ని 'నవతెలంగాణ' కథనం ప్రచురించింది. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. వెంటనే జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడారు. గీత కార్మికుడికి సొసైటీ, సభ్యత్వం లేనప్పటికీ సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించడంతోపాటు ఆ కుటుంబ పరిస్థితిపై తనకు త్వరగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఆ శాఖ సీఐ సుధీర్‌కుమార్ ఎల్బాకకు చేరుకుని కనకయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున తక్షణ సాయంగా రూ.10 వేలు అందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని చెప్పారు.
మంత్రికి కృతజ్ఞతలు : పులి నర్సయ్య- కేజీకేఎస్ జిల్లా అధ్యక్షుడు
గీత కార్మికుడికి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కల్లు, గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్యతోపాటు తాడ్వాయి పీఏసీఎస్ చైర్మెన్ పులి సంపత్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మల్ల సమ్మయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కనకయ్య కుటుంబాన్ని కేజీకేఎస్ నాయకులు, పీఏసీఎస్ చైర్మెన్ పరామర్శించారు. ఏజెన్సీలో సొసైటీ లేని పరిస్థితిలో వృత్తిలో ప్రమాదానికి గురై మృతిచెందిన గీత కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.