Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడో..?
- బడ్జెట్లో గతేడాది కంటే పైసా పెంచని సర్కార్
- ఈ యేడాది అవే నిధులు.. కొత్త పింఛన్లు ఇచ్చేదెట్టా?
- 57ఏండ్ల దరఖాస్తుదారుల లెక్కలు చూపని ప్రభుత్వం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
''సర్కారు ఇచ్చే ఆసరా పింఛన్ వస్తే మందు గోలీలకు ఆసరవుతుందని ఆశ పడ్డా.. కానీ దరఖాస్తు చేసుకుని ఏండ్లు గడుస్తున్నా పింఛన్ రావడం లేదు. ప్రతి ఏడాదీ అసెంబ్లీలో ఇదిగో వచ్చే.. అదిగో వచ్చే అని ఆశపెడుతుందే తప్ప ఒక కొత్త పింఛన్ మంజూరు చేసింది లేదు. అధికారుల దగ్గరికి పోతే.. కొత్త పింఛన్లు ఇప్పట్లో ఇచ్చేది లేదు. సర్కారు నుంచి మాకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదని ముఖంమీదే చెబుతున్నారు. వచ్చే నెల పక్కాగా పింఛన్ వస్తదని మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. ఇలాంటి మాటలు, ప్రకటనలు ఎన్నో చెప్పిండ్రు. మంత్రి సారు ఈ మాటనైన నిలబెట్టుకుంటాడో లేదో'' అని.. నార్సింగ్ మున్సిపాలిటీకి చెందిన వికలాంగుడు వడ్డెనాల మల్లేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎవరిని కదిలించినా నిరాశతో మాట్లాడుతున్నారు. మాకు ఆసరా పింఛన్ అందుతుందన్న నమ్మకం రోజు రోజుకూ సన్నగిల్లుతుందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 35 వేల ఆసరా పింఛన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 20,251 దరఖాస్తుల్లో వృద్ధులు 4919, వితంతువులు 10911, వికలాంగులు 3087, కల్లు గీత కార్మికులు 504, చేనేత కార్మికులు, 129, ఒంటరి మహిళలు 682, పైలేరియా 19 మంది దరఖాస్తులు చేసుకుని ఏండ్లు గడుస్తోంది. ప్రతి ఏడాదీ బడ్జెట్లో ఆసరా పథకానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అమలు చేయడంలో జాప్యం చేస్తోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 2019-20 బడ్జెట్ రూ.9,402 కోట్లు కేటాయించగా.. 2020-21 రూ.11,728 కోట్లు, 2022-23 బడ్జెట్లో రూ.11,728 కేటాయించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ ఆసరా పథకానికి నిధులు కేటాయించారు. కానీ, ఈసారి కొత్త పింఛన్లు ఇస్తే.. గతేడాది కంటే ఈ ఏడాది అర్హులైన వారి సంఖ్య పెరగనుంది. బడ్జెట్లో నిధులు మాత్రం రూపాయి కూడా పెరగలేదు. దీనిని బట్టి చూస్తే ఆసరాకు దరఖాస్తు చేసుకున్న వారికి మళ్లీ నిరాశే ఎదురవనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒంటిలో సత్తువ లేక కూలినాలి చేయలేని వృద్ధులకు.. వికలాంగులకు, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆసరా పింఛన్ కొంత చేయూతనిస్తుంది. వృద్ధాప్య పింఛన్‌కు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు ప్రభుత్వం తగ్గించింది. చేనేత, గీత, బీడీ కార్మికులకు 50ఏండ్లు, వితంతువులకు (18ఏండ్లు పైబడి భర్త చనిపోయి ఉంటే), ఒంటరి మహిళలకు 35 ఏండ్లుగా అర్హత వయసు ఉన్నది. వికలాంగులు, పైలేరియా, ఎయిడ్స్ బాధితులకు ఎటువంటి అర్హత వయసు లేదు. ఆసరా పింఛన్‌తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఓటరు జాబితాలో ఉన్న వయస్సును నిర్ధారించుకునేందుకు ఆధార్‌ను పరిశీలన చేశారు. అలాగే, ఏజ్ ప్రూఫ్‌కు ఇతర ఆధారాలు కూడా తీసుకున్నారు. కానీ 57 ఏండ్ల వయస్సు వారి దరఖాస్తులను కనీసం లెక్కలోకి తీసుకున్నట్టు ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సంఖ్య లేదు. ఆసరా పథకానికి కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేసి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఆరేండ్లుగా ఎదురుచూపే..
భర్త చనిపోవడంతో కుటుంబ బరువు బాధ్యత నాపై పడింది. కూలినాలి చేసిన డబ్బులతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఆసరా పింఛన్ వస్తే కొంత చేదోడువాదోడుగా ఉంటుందని ఆశ పడ్డా. ప్రభుత్వం మా ఆశల మీద నీళ్లు చల్లింది. పింఛన్ కోసం ఎక్కనిమెట్టు లేదు. మొక్కని కాలు లేదు. ఎవరూ కరణించేవారు లేరు. అధికారులను అడిగితే మా చేతిలో ఏమీ లేదంటూ దాటవేస్తున్నారు. ఇగ ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఇప్పటికైనా సర్కారు మా గోస చూసి పింఛన్ మంజూరు చేయాలి.
- గాండ్ల శారద- నార్సింగ్ మున్సిపాలిటీ