Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే విరమించుకోవాలి :
- పట్నం రాష్ట్ర కార్యదర్శి డిజి నర్సింహారావు
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాను పెంచుకోవడం కోసం వార్షిక సగటు ఆదాయంగా మార్పు చేసి ఆస్తిపన్ను పెంచాలనే ఆలోచన అత్యంత దుర్మార్గమైనదని తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక(పట్నం) రాష్ట్ర కార్యదర్శి డిజి.నర్సింహారావు అన్నారు. ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహించిన పట్నం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్తి పన్ను స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు అనిరాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రభుత్వం నిధులు ఎగ్గొట్టడం కోసం స్వయం సమృద్ధి పేరుతో ప్రజలపై భారాలు మోపే విధానాలను తీసుకొస్తుందని, దీనిని తిప్పి కొట్టాలని ప్రజలకు సూచించారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో 3 శాతం అప్పులు తెచ్చుకోవచ్చని, దానికి కేంద్రం మరో రెండు శాతం పెంచి ఐదు శాతానికి అవకాశం ఇచ్చిందన్నారు. దీనిలో నాలుగు కండిషన్లు విధిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తుందన్నారు. ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు.. పట్టణాల్లో పన్నులు విధించడం, విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రయివేటీకరించడం ఇలాంటి కండిషన్స్తో ప్రజలను పీల్చిపిప్పి చేసే విధంగా పాలకులు అనుసరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల ఇండ్ల నిర్మాణం చేస్తామని వాగ్దానం చేసి.. మాటలు కోటలు దాటాతాయి కానీ.. కాళ్లు గడప దాటని చందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పట్నం రాష్ట నాయకులు డీఏఎస్వీ ప్రసాద్, డి.మల్లేశం, ఎండీ.సలీమ్, పందిరి శ్యాంసుందర్, శిలా రాజయ్య, అవుత సైదులు, భూతం అరుణ, కుంభం కృష్ణరెడ్డి, రామూర్తి, వి.మధుసూదన్ రెడ్డి, జూలేక, ఎస్.సైదాచారి, అదంకి నర్సింహ, అంజాద్ తదితరులు పాల్గొన్నారు.