Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు విజరుకుమార్
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తూ కాలం గడుపుతున్నాయని డీవైఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎ.విజరుకుమార్ విమర్శించారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగిన డీవైఎఫ్ఐ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలోకి వచ్చేందుకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఎప్పటికప్పుడూ వారి అవసరాల మేరకు నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తూ.. నోటిఫికేషన్లు వేస్తామని నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా మతాల మధ్య చిచ్చుపెడుతూ ఎన్నికల్లో లబ్దిపొందడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని విమర్శించారు.
బహుళజాతి కంపెనీలకు కోట్లాది రూపాయల ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఎంతో లాభాల దిశలో ఉన్న కంపెనీలను కూడా ప్రయివేట్పరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగసంస్థలను నిర్వీర్యం చేయడమే ధ్యేయంగా బీజేపీ పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం దుర్మార్గమన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల పాలనలో కేంద్రానికి తీసిపోని విధంగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష 92 వేల ఉద్యోగాలను భర్తీ చేయకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం ఇటీవల కేవలం 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం తగదన్నారు. ఉద్యోగాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రకటనలతో కాలయాపన చేయకుండా వెంటనే అన్ని నోటిఫికేషన్లు విడుదల చేసి సత్వరమే ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు డీివైఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, రాష్ట్ర కార్యదర్శి అనకంటి వెంకటేష్, నాయకులు బషీర్, రాజు, శివవర్మ, మల్లం మహేష్, గడ్డం వెంకటేష్, పల్లా వెంకట్రెడ్డి, ములకలపల్లి సీతయ్య, పిన్నేపు వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి బోయిళ్ల నవీన్, పట్టణ కార్యదర్శి మీసాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.