Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ- ముదిగొండ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటాలు నిర్వహించాలని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ నవతేజ ఫంక్షన్ హాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రానైట్ కార్మికుల లోడింగ్, అన్ లోడింగ్ వర్కర్స్ యూనియన్ సదస్సు.. సంఘం మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్ అధ్యక్షతన శనివారం జరిగింది.
ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు, కార్మికులకు ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేసి పెద్దవాళ్లకు ఉపయోగపడే స్కీములను ఏర్పాటు చేసిన ఘనుడు ప్రధాన మంత్రి మోడీ అని విమర్శించారు. దేశ ప్రజల, కార్మికుల సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక పోరాటాలు ఉధృతం చేయాలన్నారు. కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ రంగసంస్థలను ప్రయివేటుపరం చేస్తూ ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్నారన్నారు. ఉద్యమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి పోరాటాలు నిర్వహించి దేశద్రోహుల నుంచి ప్రజలను, దేశ సంపదను కాపాడుకోవాలన్నారు. ఉపాధిహామీ చట్టాన్ని అన్ని చోట్లా అమలు చేసి ప్రజలకు పని కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28, 29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సదస్సులో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, సీఐటీయు నాయకులు ఇరుకు నాగేశ్వరరావు, వాలియా, చెట్టుపోగు వెంకటేశ్వర్లు, తేరాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.