Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరీశ్‌రావుకు సీపీఎస్‌టీఈఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్)ను రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావును సీపీఎస్‌టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్‌రావు నేతృత్వంలో హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల రాజస్థాన్, చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాయని వివరించారు. రాష్ట్రంలోనూ అదే తరహాలో సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సీపీఎస్ వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారనీ, నష్టపోతున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ పింఛన్ పొందాలంటే సీపీఎస్‌లో జమ అయిన సొమ్మును ప్రభుత్వానికి ఇవ్వాలనే నిబంధన సమంజసం కాదని పేర్కొన్నారు. గతేడాది నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మరణించిన ఖలీల్ కుటుంబానికి ఇంకా కుటుంబ పింఛన్‌ను వర్తింపచేయలేదని వివరించారు. గ్రాట్యూటీ, డెత్ కంట గ్రాట్యూటీలోనూ అనేక సమస్యలున్నాయనీ, వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్‌టీఈఏ అదనపు ప్రధాన కార్యదర్శి ఘణపురం సురధీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ టివి ప్రసాద్, ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్‌రావు, నాయకులు కమలేకర్ నాగేశ్వరరావు, వెంకట్ నారాయణరెడ్డి, రఘునాథరెడ్డి, రమేష్, సతీష్, రాజేష్, పెద్దొళ్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతులకు ముందే అప్పీళ్లను పరిష్కరించాలి : టీపీటీఎఫ్
ఉపాధ్యాయుల పదోన్నతులకు ముందే అన్ని రకాల అప్పీళ్లనూ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షులు వై అశోక్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్ తిరుపతి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరస్పర బదిలీలకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేయాలని తెలిపారు. బదిలీలు, పదోన్నతులకు ముందే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.