Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యరంగాన్ని బలోపేతం చేసిన సీఎం కేసీఆర్
- అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఏనాడు ప్రజావైద్యాన్ని పట్టించుకోలేదనీ, దాంతో రాష్ట్రంలో ప్రయివేటు ఆస్పత్రులు పెరిగాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. దీంతో ప్రజలు ప్రతి ఆరోగ్య సమస్యకు ప్రయివేటును ఆశ్రయించి ఆర్థికంగా చిక్కిపోయి, పెద్ద రోగం వస్తే అప్పులు చేసి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వైద్యరంగాన్ని బలోపేతం చేసి గుణాత్మక మార్పు తీసుకువచ్చారని తెలిపారు. శనివారం అసెంబ్లీలో వైద్యారోగ్యశాఖ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి సమాధానమిస్తూ, రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య మూడు నుంచి 17కు పెరిగిందనీ, ఈ ఏడాది కొత్తగా మరో ఎనిమిది, వచ్చే ఏడాది ఇంకో ఎనిమిది వైద్యకశాలలు రానున్నాయని చెప్పారు మెడికల్ సీట్లతో పాటు నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ సీట్లు పెరిగాయన్నారు. బస్తీ, పల్లె దవాఖానాలు, కేసీఆర్ కిట్ పథకం, కంటి వెలుగు వంటి పథకాలు తెచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో నిమ్స్ తరహా ఒక్క ఆస్పత్రిని అదనంగా తేలేదనీ, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో నాలుగు టిమ్స్ ఆస్పత్రులతో పాటు నిమ్స్ లో అదనంగా 2,000 పడకలను తేనున్నారని చెప్పారు. వరంగల్‌లో రూ.1,100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రాబోతుందన్నారు. ఇప్పటికే తలసరి వైద్య ఖర్చులు రూ.1,698తో దేశంలో మూడో స్థానంలో ఉండగా, ప్రస్తుత బడ్జెట్‌తో అది కాస్తా రూ.3,092కు చేరిందని తెలిపారు.
ప్రసూతి మరణాలను తగ్గించడంలో తమిళనాడును అధిగమించామని తెలిపారు. కేసీఆర్ కిట్ సత్ఫలితమిచ్చిందని చెప్పారు. సిజేరియన్ ఆపరేషన్లు తగ్గుముఖం పట్టాయనీ, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షలకు పెంచడంతో 87.5 లక్షల కుటుంబాలకు మేలు కలిగిందన్నారు.
ఆయుష్మాన్ భారత్ కొందరికే....
కొంత మంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మంత్రి, ఆయుష్మాన్ భారత్ సేవలు 26 లక్షల కుటుంబాలకు మాత్రమే అందుతున్నాయని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ సేవలు 90 లక్షల మందికి అందుతున్నాయనీ, రెండు పథకాలను కలిపి ప్రభుత్వం అమలు చేస్తున్నది. దేశంలోనే తొలిసారిగా హెల్త్ ప్రొఫైల్‌కు తెలంగాణ శ్రీకారం చుట్టిందన్నారు.
ఒక్క పోస్టు ఖాళీ లేకుండా.....
ప్రభుత్వ రంగంలో మౌలిక సదుపాయాలతో పాటు ఒక్క పోస్టు ఖాళీ లేకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ఆశాలు, కాంట్రాక్టు, ఒప్పంద పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచామన్నారు. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి తీసుకున్న, తీసుకుంటున్న చర్యలు బాగున్నందునే అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని మంత్రి అన్నారు.
కేంద్రం వివక్ష
కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయకుండా రాష్ట్రంపై వివక్ష చూపించిందని హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చేందుకు ముందుకొచ్చారన్నారు. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషన్ మెడిసిన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో పెట్టాలని కేంద్రాన్ని కోరారు. అందుకవసరమైన స్థలం, అనుమతులిస్తామని చెప్పినా మోడీ సర్కారు పట్టించుకోకుండా గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించిందని విమర్శించారు.