Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకు పోటీ చేస్తా : మాజీ మంత్రి తుమ్మల
నవతెలంగాణ - మధిర
టీఆర్ఎస్కు రెబెల్‌గా మారాల్సిన అవసరం తనకు లేదని, వ్యక్తిగత లబ్ది కన్నా పార్టీ నిర్ణయమే ముఖ్యమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర, పెనుబల్లిలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మధిరలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధుల నడవడిక ఉండాలన్నారు. కేసీఆర్ పాలనాదక్షతపై ప్రజలకు అపార నమ్మకముందన్నారు. పార్టీ నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ కోసం విధేయతగా పని చేస్తానని తెలిపారు. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుతో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారన్నారు. జిల్లా చుట్టూ జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. పార్టీ విధేయతకు కట్టుబడి పని చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచన చేశారు. ఈ సమావేశంలో చెరుకూరి నాగార్జున, ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి, పుతుంభాక శ్రీకృష్ణ ప్రసాద్, చీరాల వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, మొండి తోక సుధాకర్, యెన్నం కోటేశ్వరరావు, మాదల రామారావు, న్యాయవాది రామరాజు పాల్గొన్నారు. అనంతరం మధిరలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన టీడీపీ పట్టణ కార్యదర్శి వీరమాచినేని శ్రీనివాసరావు కుటుంబాన్ని తుమ్మల పరామర్శించారు.