Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నోత్తరాల్లో మంత్రి తలసాని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకానికి ప్రోత్సాహంపై అధికార పార్టీ సభ్యులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, గొంగిడి సునీత, ముఠా గోపాల్ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ బీమాను అమలు చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులను పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను మరిచిపోయాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో అన్ని కులాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. దీంతో ఇప్పుడు చేపల ఎగుమతిలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. చేపలతో పాటు రొయ్యల పెంపకాన్ని కూడా చేపట్టామన్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 150 సంచార వాహనాలను మత్స్యకారులకు అందించామని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
డిప్యూటీ స్పీకర్‌కు, ఎమ్మెల్యే రసమయికి వాగ్వాదం
ప్రశ్నోత్తరాలలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. రసమయి ప్రశ్న అడుగుతుండగా మైక్ కట్ చేసి.. మరో ఎమ్మెల్యే గొంగిడి సునీతకి డిప్యూటీ స్పీకర్ మైక్ ఇచ్చారు. దీంతో ప్రశ్న అడగనివ్వకుంటే ప్రశ్నలు ఎందుకు ఇస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ను రసమయి ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలు మాత్రమే అడగకుండా స్పీచ్ ఇస్తున్నారని డిప్యూటీ స్పీకర్ ఆక్షేపించారు. ప్రశ్నలు తొందరగా అడగాలని పద్మారావు సూచించారు. రసమయి అసంతప్తిపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలగజేసుకోగా.. ఆయనపై సైతం ఎమ్మెల్యే అసంతప్తి వ్యక్తం చేశారు. సభలో మాట్లాడదామంటే మాట్లాడే అవకాశాలు రావనీ, కనీసం ప్రశ్నలు కూడా అడిగే అవకాశం కూడా ఇవ్వకుంటే ఎలా? అని రసమయి అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్న అడగకుండా మధ్యలోనే రసమయి కూర్చోగా, ప్రశ్న త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు సూచించడంతో ఆయన కొనసాగించారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయం:మంత్రి మల్లారెడ్డి
రాష్ట్రంలోరిజిస్ట్రేషన్ చేసుకున్న12.60 లక్షల మంది కార్మికుల కోసం రూ. 1845 కోట్లు కేటాయించి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి సిహెచ్.మల్లారెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల్లో టీఆర్ఎస్ సభ్యులు కొరుకంటి చందర్, నన్నపునేని నరేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ప్రమాద బీమాను సైతం అమలుచేస్తున్నామని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కనీస వేతనాలపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. కార్మిక చట్టాలు అమలుచేయాలనీ, ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుల ఒప్పందం అమలు ఎమ్మెల్యేలు కోరగా మంత్రి స్పందిస్తూ తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆరు ప్రశ్నలు వాయిదా
శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మొత్తం పది ప్రశ్నలకుగాను కేవలం నాలుగు ప్రశ్నలపై చర్చించారు. మిగతా ఆరు ప్రశ్నలను వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. వాయిదా వేసిన వాటిలో రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం, భూపాలపల్లి పట్టణానికి బైపాస్‌రోడ్డు, ఒఆర్ఆర్ సమీపంలోని గ్రామాలకు తాగునీరు, జర్నలిస్టుల సంక్షేమం, రోడ్లను వెడెల్పు చేసేపనుల్లో అవరోధాల తొలగింపు, నూతనంగా ఏర్పడిన మండలాల్లో మండల కార్యాలయాల భవన సముదాయాలు నిర్మాణం తదితర ప్రశ్నలు వాయిదాపడిన వాటిలో ఉన్నాయి.