Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28, 29 తేదీల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయండి
- సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులంతా తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలనీ, ఈనెల 28, 29 తేదీలలో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో వారంతా పాల్గొనాలని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని పోస్టల్ యూనియన్ కార్యాలయంలో పి. మురళి అధ్యక్షతన జరిగిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కాంట్రాక్ట్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. కాంట్రాక్ట్ లేబర్ చట్టం రద్దుతో కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్న కొద్దిపాటి రక్షణలు కూడా రద్దై బానిసలుగా పని చేయాల్సి వస్తుందన్నారు. పని గంటలు పెంచి, పీఎఫ్ ఈఎస్ఐ తదితర సంక్షేమ ప్రయోజనాలను కూడా అందకుండా చేసే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను గుండుగుత్తగా కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు యత్నిస్తున్నదన్నారు. లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ఆరు లక్షల కోట్ల రూపాయలకే కట్టబెడుతున్నదనీ, దీన్ని ప్రజలంతా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థల భూములను, భవనాలను కారుచౌకగా కార్పొరేట్ల కట్టబెట్టేందుకు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్ట్ వర్కర్స్ కన్వీనర్ బి. మధు, నాయకులు బి. పరిపూర్ణాచారి, ఎస్.కిషన్, జి. శ్రీనివాసులు, సత్తయ్య, టి. జయసూరి, ఎం. మైపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్, రాములు, వి.ఎస్. శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.