Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం
- కేసీఆర్ ఫెలోషిప్ ఆలోచిస్తాం
- ఫీజుల నియంత్రణ కోసం సీఎంకు నివేదిక అందజేస్తాం
- ప్రతి వర్సిటీలో కోచింగ్ సెంటర్లు
- విద్యాశాఖ పద్దుపై మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారనీ, దాన్ని త్వరలోనే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఉపాధ్యాయ నియామకాలను చేపడతామని వివరించారు. అసెంబ్లీలో బడ్జెట్పద్దులపై చర్చ సందర్భంగా శనివారం విద్యారంగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. విద్యాశాఖలో త్రివేణి సంగమంలా ఉందని చెప్పారు. సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం 'మన ఊరు-మనబడి' కార్యక్రమం, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం, ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం వంటివి ప్రస్తుతం జరుగుతున్నాయని వివరించారు. దీంతో విద్యాశాఖలో పండుగ వాతావరణం ఉందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకే మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని రూ.7,289 కోట్లతో 12 అంశాలను అమలు చేస్తున్నామని వివరించారు. మొదటివిడతలో రూ.3,497 కోట్లతో విద్యార్థులు ఎక్కువగా ఉన్న 9,123 స్కూళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో కలెక్టర్లు పనిచేయాలని సూచించారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు రూ.కోటి చొప్పున మంజూరు చేశామని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ప్రారంభించే ఇంగ్లీష్ మీడియం కోసం ద్విభాష పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించామన్నారు. ఈనెల 14వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. కోఠి మహిళా కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.వంద కోట్లు కేటాయించిందని వివరించారు. సమూల మార్పులతోనే సమున్నత లక్ష్యాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులను బంగారుబాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు.
కేంద్రం చిన్నచూపు
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. భారత్‌లో తెలంగాణ భాగం కాదన్నట్టు వ్యవహరిస్తున్నదని అన్నారు. ఐఐఎం, ఐఐటీలు, త్రిపుల్ఐటీలు, ఐసర్, ఎన్ఐటీ, నవోదయ వంటి విద్యాసంస్థలను దేశవ్యాప్తంగా ప్రకటించినా తెలంగాణకు ఒక్క విద్యాసంస్థనూ ఇవ్వలేదని వివరించారు. కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. పాఠశాల విద్యలో 13,086 పోస్టులు, ఉన్నత విద్యలో 7,878 పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో 2,020 బోధన, 2,774 బోధనేతర పోస్టుల భర్తీతోపాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలోనూ కాంట్రాక్టు అధ్యాపకులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయం పరిధిలో పోటీపరీక్షల కోసం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని వీసీలకు ఆదేశాలిచ్చామని చెప్పారు. విద్యాయజ్ఞంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమనీ, అందరూ భాగస్వాములు కావాలని కోరారు. గురుకులాల గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాలు, వర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వర్సిటీల్లో పరిశోధనలు చేసే విద్యార్థులకు కేసీఆర్ ఫెలోషిప్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం మంత్రివర్గ ఉపసంఘం అనేక అంశాలను పరిశీలించిందని చెప్పారు. త్వరలోనే నివేదిక రూపొందించి సీఎంకు అందజేస్తామన్నారు.
సీపీఎస్‌ను రద్దు చేయాలి : శ్రీధర్‌బాబు
నూతన విద్యావిధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తారా? లేదా? చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి శ్రీధర్‌బాబు అడిగారు. పదివేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారనీ, వాటిని మంజూరు చేస్తారా?అని ప్రశ్నించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలతోపాటు ప్రాథమిక పాఠశాలల్లోనూ భోజనశాలను నిర్మించాలని కోరారు. ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఐటీఐల సిలబస్‌ను రూపొందించాలని సూచించారు. సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానమిచ్చారు.