Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం
- కంటోన్మెంట్లో ఇష్టారాజ్యం కుదరదు
- ఆర్మీ అధికారులకు కేటీఆర్ హెచ్చరిక
- అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ
- హైదరాబాద్‌కు కేంద్ర పెద్దలు అర పైసా కూడా సాయం చేయలేదని వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డుపడుతున్న కంటోన్మెంట్ అధికారులను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వారు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వాళ్లు రోడ్లు బంద్ చేస్తే.. తాము కరెంట్, నీళ్లు బంద్ చేస్తామని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో శనివారం డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు అధ్యక్షతన ప్రారంభమైన ప్రశ్నోత్తరాల్లో కార్వాన్ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై ఎంఐఎం సభ్యుడు మౌజంఖాన్, టీఆర్ఎస్ సభ్యులు కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, దానం నాగేందర్, మాధవారం కృష్ణారావు, కె.పి.వివేకానంద్ తదితరు హైదరాబాద్‌లోని నాలాలు, వాటి అభివృద్ధి గురించి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పారు. ఒక వైపు కంటోన్మెంట్లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతున్నది. శాతం తల చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదు. ఒకవైపు కంటోన్మెంట్, మరోవైపు ఏఎస్ఐ అడ్డు పడుతున్నది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ వేరే దేశం అన్నట్టుగా కేంద్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నది. హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు కంటోన్మెంట్ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇష్టమొచ్చినట్టు రోడ్లు బంద్ చేస్తాం..నాలాల మీద చెక్ డ్యాంలు కడతామంటే మేం కూడా ఊరుకోం అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. అవసరమైతే మంచినీళ్లు, కరెంట్ బంద్ చేస్తాం. అప్పుడైనా దిగిరారా? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని పురపాలక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన కఠిన చర్యలకు కూడా వెనుకాడొద్దనీ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తాను ఈవిషయం సభలో చెబుతున్నానని అన్నారు. పైసా సాయం చేయరు కానీ, పని చేస్తున్న ప్రభుత్వానికి అవరోధాలు కలిగించడం కలిగిస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌లో రూ. 985 కోట్లతో ఎస్ఎన్డీపీ పనులు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కొరకు ప్రభుత్వం వ్యూహాత్మక నాలాల అభివద్ధి(ఎస్ఎన్డీపీ) కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఎస్ఎన్డీపీ కింద రూ. 985.45 కోట్ల వ్యయంతో మొత్తం 60 పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని గుర్తు చేశారు. మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు హైదరాబాద్‌లో మూడు దశల్లో పనులు చేపట్టాలని నిర్ణయించాం. ఎంసీహెచ్‌లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు లేవు. శివారు ప్రాంతాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలని నిర్ణయించాం. మొత్త మూడు దశలకు రూ. 11 వేల కోట్లతో హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ చేసినట్టు చెప్పారు. వరద నీటి కాల్వలు, మురికి నీటి కాల్వలు కలిసిపోయాయి. నాలాల మీద అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఎస్ఎన్డీపీ ద్వారా వరద నీరు, మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఏరియాలో రూ. 735 కోట్లతో, జీహెచ్ఎంసీ వెలుపల రూ. 250 కోట్లతో 60 పనులను చేపట్టామని చెప్పారు. ఈ పనులపై ప్రతి వారం తానే సమీక్షిస్తున్నానని తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి ఈ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ ఎస్ఎన్డీపీ పనుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు తిరిగి, ఫోటోలకు ఫోజులిచ్చారు.. కానీ నిధులు మాత్రం ఇవ్వలేదు. గుజరాత్‌కు మాత్రం రూ. వెయ్యి కోట్లు ఇచ్చారు. హైదరాబాద్‌కు నిధులు ఇవ్వకపోవడం అనేది నిజంగా సిగ్గు పడాల్సిన విషయమన్నారు. హైదరాబాద్‌కు కేంద్ర పెద్దలు అర పైసా కూడా సాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో కలుషిత నీటిని తాగి భోలక్‌పూర్‌లో 11 మంది మతి చెందారని కేటీఆర్ గుర్తు చేశారు.
కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం మన దురదృష్టం: మంత్రి కేటీఆర్
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌కు వరద సహాయం చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రమంత్రికి కూడా మనసు రావడంలేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం మన దురదష్టమన్నారు.