Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల కేంద్రాలకూ కరువే
- గోవాకు పోకండి...లక్నవరం రండి
- ములుగు జిల్లాలో డిపోలు, బస్టాండ్లు ఏర్పాటు చేయాలి: సీతక్క
- ప్రయాణీకుల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులు : మంత్రి అజరుకుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొత్త జిల్లా ములుగులో బస్సు డిపోలు, బస్టాండ్లు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సభ్యులు సీతక్క శాసనసభలో ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ నుంచి జిల్లా కేంద్రంగా ఎదిగిన ములుగులో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవనీ, వెంటనే ప్రభుత్వం ఆ దిశగా దృష్టిసారించాలని కోరారు. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆమె మాట్లాడుతూ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో స్థానిక గిరిజనులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలోని బస్‌స్టేషన్ శిథిలావస్థకు చేరిందని వివరించారు. సమ్మక్క సారాలమ్మ జాతర ద్వారా ఆర్టీసీకి బాగా ఆదాయం వచ్చిన సంగతిని గుర్తు చేశారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయనీ, వాటినీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గోవాకు పోవద్దనీ, లక్నవరం రావాలని పిలుపునిచ్చారు. గత సభలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించాననీ, డిపోలు, బస్టాండ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా పర్యాటకులను ప్రొత్సహించాలని సూచించారు. ఎంఐఎం సభ్యులు మౌజంఖాన్, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, జాఫర్ హుస్సేన్,సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో బస్సుల సంఖ్య రానురాను తగ్గిపోతున్నదని తెలిపారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత నగరంలోని బస్సుల సంఖ్యను తెలపాలని వారు కోరారు. ఆయా ప్రశ్నలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ సమాధానమిస్తూ ప్రయాణికుల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 9,800 బస్సులు తిరిగితే.. 2022లో 9,057 బస్సులు తిప్పుతున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాడు 3,554 బస్సులు అందుబాటులో ఉంటే, ప్రస్తుతం 2,865 బస్సులు నడుపుతున్నామని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో భారీ వెడెల్పయిన రోడ్లు, ప్లైఒవర్లు అందుబాటులోకి వచ్చాయనీ, ఆ నేపథ్యంలోనే పెద్ద బస్సులు పడుతున్నామని అన్నారు.
మినీ బస్సులు నడిపే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. డీజిల్ ధరలు భారీగా పెరిగినందునే మినీ బస్సులను నడపట్లేదని స్పష్టం చేశారు. మినీ బస్సుల్లో ప్యాసింజర్ కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు వీలుగా ఉండేందుకు పెద్ద బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ములుగు కొత్త జిల్లా కావడంతో అక్కడ బస్ డిపో, బస్టాండ్ ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నదనీ. బస్సులను కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ, మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ నుంచి పది బస్సుల కోసం ఆర్థిక సహాయం చేయిస్తున్నారని చెప్పారు. తొందరలోనే డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లమీదికొస్తాయని వివరించారు. మేడారం జాతరలో రూ. 11 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందనీ, లాభం రాలేదన్నారు. 2,763 బస్సుల్లో 11 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తరలించి సేవలు అందించామని చెప్పారు.