Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం నగరపాలక సంస్థలో సైలెంట్‌గా దోపిడీ
- సకాలంలో చెల్లించినా ప్రస్తుత మొత్తంపై వడ్డీ
- నోటీసులు, మెసేజ్‌లు లేకుండా వసూళ్ల పర్వం
- ఒక్కో ఇంటికి రూ.100కు పైన కాజేస్తున్న వైనం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని ముస్తఫానగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రతి ఏడాదీ కచ్చితంగా మార్చి నెలలో సకాలంలో ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. ఇంటి పన్ను వసూళ్లకు ముందు ఎంత పన్ను చెల్లించాలో నోటీసు లేదా సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చేది. ఈ సంవత్సరం అలాంటివేవీ లేకపోవడంతో డివిజన్లో హడావుడి చూసి ఇంటి పన్ను గురించి తెలుసుకుని సమీపంలోని పన్ను చెల్లింపు కేంద్రం వద్దకు వెళ్లారు. ఇంటి నంబర్, సెల్‌ఫోన్ నంబర్ చెప్పగానే రశీదు తీసి ఇచ్చారు. ఆయన బిల్లుపై వివరాలేవీ పరిశీలించకుండా రూ.1785 ఇంటి పన్ను చెల్లించాడు. ఆ తర్వాత బిల్లు పరిశీలించగా బకాయి సున్నా అని ఉంది. ప్రస్తుత మొత్తం రూ.1684, దానిపై వడ్డీ రూ.101 అని ఉంది. సకాలంలో చెల్లించినప్పుడు వడ్డీ ఎందుకు వేశారని ప్రశ్నిస్తే.. అదంతే అని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దాంతో ఆయన చేసేదేమీ లేక వెళ్లిపోయాడు. శ్రీనివాసనగర్‌లో మరొకరికి ఇంటి పన్ను రూ.2,200 వస్తే ప్రస్తుత మొత్తంపై వడ్డీ రూ.300 అని సూచించారు. ఆయనకు కూడా బకాయిలు లేవు. బకాయి లేనప్పుడు వడ్డీ ఎందుకు వేశారని సిబ్బందిని ఇతను నిలదీశారు. 'మిషన్‌లో ఎలా ఫీడ్ అయ్యి ఉంటే ఆ బిల్లు ఇవ్వడమే మా పని' అని సమాధానం ఇచ్చారు. ఎలాంటి బకాయి లేనప్పటికీ రూ.100 మొదలు రూ.1000కి పైగా మొత్తం పన్నుపై వడ్డీ పేరుతో కార్పొరేషన్లో తెలియని దోపిడీ చేస్తున్నట్టు వినియోగదారులు వాపోతున్నారు.
రూ.కోట్లలో 'వడ్డి'ంపు
ఖమ్మం నగరంలోని 60 డివిజన్లలో 20 కేంద్రాల ద్వారా 70,263 నిర్మాణాల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. వీటిలో 242 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలున్నాయి. ఇవి మినహా నివాస గృహాలు 63,138, కమర్షియల్ బిల్డింగ్లు 3,266, పాక్షిక నివాస/ నివాసేతర గృహాలు 3,580. మొత్తం 69,984 వరకూ ఉన్నాయి. ఈ నిర్మాణాల యజమానులు 70% మందికి పైగా ప్రతియేటా సకాలంలో పన్నులు చెల్లిస్తున్నారు. వీరిలో కొందరిని మినహాయించి మరికొందరికి బకాయి లేనప్పటికీ ప్రస్తుత మొత్తంపై వడ్డీ వేశారు. వీరిలో వడ్డీ వేయని వారు 20వేల వరకు ఉన్నా.. మిగిలిన 50వేల మందికి ఒక్కో నిర్మాణానికి సగటున రూ.300 చొప్పున వడ్డీ వసూలు చేసినా దాదాపు రూ.కోటికి పైగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే పన్ను భారంతో అవస్థ పడుతున్న నగర వాసుల నుంచి అడ్డదారిలో సైలెంట్‌గా చేస్తున్న దోపిడీపై కౌంటర్ల వద్ద ప్రజలు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
సమాచారం లేకుండా ట్యాక్స్ వసూళ్లు
బకాయి ఉన్న వారికి మాత్రమే నోటీసులు, సెల్‌ఫోన్ మెసేజ్‌లు చేసిన కార్పొరేషన్ సిబ్బంది.. బకాయి లేని వారికి మాత్రం అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం డివిజన్లలో మైకుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటి యజమానులు గమనించి పన్ను చెల్లిస్తే సరి. లేదంటే బకాయి పేరుతో వడ్డీ వాయించే కుటిల యత్నాలు కార్పొరేషన్ నుంచి సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. నోటీసులు, మెసేజ్ వంటివేవీ పంపకపోవడంపై కార్పొరేషన్ అధికారులను ప్రశ్నిస్తే.. కరోనా కారణంగా నోటీసులు పంపలేదంటున్నారు. ఈ విషయమై కమిషనర్, మేయర్లను 'నవతెలంగాణ' నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో లేరు. ఫోన్లో సంప్రదించగా మీటింగ్‌లో ఉన్నట్టు తెలిపారు.
వడ్డీ వేయడాన్ని ఖండిస్తున్నాం
ఇప్పటికే ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంట్ బిల్లుల భారంతో ప్రజలు సతమతమవుతుంటే.. అది చాలదన్నట్టు ఇంటి పన్ను బకాయి లేకున్నా ప్రస్తుత మొత్తంపై వడ్డీ పేరుతో ప్రజలను పీడించడం సరికాదు. అక్రమ పద్ధతిలో దోపిడీకి పాల్పడితే ఊరుకునేది లేదు. ఈ అడ్డదారి వసూళ్లను ఆపకపోతే ఆందోళనలు నిర్వహిస్తాం.
- నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం)
ఖమ్మం జిల్లా కార్యదర్శి
సకాలంలో చెల్లించినా వడ్డీ వేయడం సరికాదు
మాకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. ఇంటి పన్ను కట్టించుకుంటున్నారని తెలిసి వచ్చి కడుతున్నాం. ఇంతకుముందు నోటీసులు, మెసేజ్‌లు పంపించే వారు. ఇప్పుడు అవేవీ లేవు. సకాలంలో చెల్లించినా ప్రస్తుత మొత్తంపై వడ్డీ అని రూ.1684కి రూ.1785 కట్టించుకున్నారు. సకాలంలో పన్ను చెల్లించినా వడ్డీ వేయడం సరికాదు. పైగా నల్లా కనెక్షన్ ఇవ్వకుండానే పన్ను వసూలు చేస్తున్నారు.
- మన్మథబాబు, ముస్తఫానగర్- 22వ డివిజన్