Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
- సొంతగూటికి చేరిన 400 కుటుంబాలు
రాబోయే కాలంలో పెద్దఎత్తున భూ పోరాటాలు చేస్తామని, ఇందుకు సిద్ధమవ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా 41వ డివిజన్ కాశికుంటలో శనివారం సీపీఐ(ఎం) రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శి ఎం.సాగర్ అధ్యక్షతన సభ నిర్వహించారు. కాశికుంట, మైసయ్యనగర్కు చెందిన 400 కుటుంబాలు తిరిగి సీపీఐ(ఎం)లో చేరాయి. వారికి నాగయ్య కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కష్టాలు, బాధలు తీరాలంటే ఎర్రజెండా పార్టీలతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ తదితర బూర్జువా పార్టీలు దోపిడీ దొంగల వర్గానికి నిలయంగా మారాయని విమర్శించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన భూ పోరాటంలో కుసుమ రఘునాథ్, రామ సురేందర్ లాంటి ఎంతోమంది యువకులు.. గుండాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెవాసుల అభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యమవుతుందన్నారు. బూర్జువా పార్టీలు పేదలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తాయన్నారు. ప్రభుత్వ భూములను అమ్మి రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, వారి లిస్టు త్వరలోనే బయటకు తీస్తామని అన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ 8 ఏండ్లు గడుస్తున్నా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు.
సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం
ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలే మార్గమని నాగయ్య అన్నారు.ఉర్సుగుట్ట రోడ్డులోని రామ సురేందర్ భవన్లో సింగారపు బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల, పట్టణ ప్రాంత కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర సోషల్ మీడియా విభాగం కన్వీనర్ జగదీష్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. బడ్జెట్లో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశామని గొప్పలు చెప్పడమే తప్ప వాటిని ఖర్చు చేసి అభివృద్ధికి తోడ్పడిన దాఖలాలు లేవన్నారు. బడ్జెట్ కేటాయింపులు అంకెలగారడీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే కేవలం 80 వేల ఉద్యోగాలు ప్రకటించి మిగతా 29 లక్షల నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి భరోసా కల్పించకపోవడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నలిగంటి రత్నమాల, ఏరియా కమిటీ సభ్యులు ప్రత్యూష, జ్యోతి, ఓదేలు, మాధవి, మొగిలి, శ్రీను, హరీష్, సీఐటీయూ, కేవీపీఎస్ ప్రతినిధులు ముక్కెర రామస్వామి, అరూరి కుమార్, బషిర్, సాగర్, యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.