Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పీఎఫ్ వడ్డీ రేట్ల తగ్గింపు కార్మిక వ్యతిరేక చర్య అనీ, కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడం అన్యాయమని పేర్కొన్నారు. తగ్గిన వడ్డీ 0.4 శాతం వల్ల కార్మికులు భారీగా ఆర్ధిక నష్టం చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల కాలంలో వడ్డీ రేట్లను అతి తక్కువగా నిర్ణయించిన కాలం ఇదేనని పేర్కొన్నారు. ఈపీఎఫ్ తగ్గించాలని ప్రభుత్వ ప్రతినిధులు, యాజమాన్య సంఘాల ప్రతినిధులు ప్రతిపాధించగా సీఐటీయూతో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకించాయని తెలిపారు. వడ్డీ రేటును యధాతథంగా ఉంచాలని కోరినప్పటికీ మెజార్టీ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామనే పేరుతోటి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యకు పూనుకున్నదని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీఎఫ్ నిధులను షేర్ మార్కెట్లలో పెట్టాలని చేసిన ప్రయత్నాలను కార్మిక వర్గం ప్రతిఘటించినా, బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా మొత్తం పీఎఫ్ డిపాజిట్లలో 15 శాతం షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. లాభనష్టాలపై ఆధారపడి వడ్డీ రేట్లు నిర్ణయం చేయడం తగదనీ, కార్మిక సామాజిక భద్రత కోణంలో చూడాలే తప్ప వ్యాపార కోణంలో చూడవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను కార్మికులు యూనియన్లు, సంఘాలకు అతీతంగా వ్యతిరేకిస్తూ మార్చి 28,29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.